ప్రజా సమస్యల పరిష్కార వేదికే ‘మీకోసం’
జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు
కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కార వేదికే మీకోసం కార్యక్రమమని జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని, బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు చేరువగా పోలీసు సేవలు ఉండాలన్నదే పోలీసుశాఖ నిర్ణయమని, ఆ మేరకు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో మీకోసంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామన్నారు. మీకోసంలో 28 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.
ప్రధానమైన అర్జీలు
● వడ్లమన్నాడుకు చెందిన కవిత తన వివాహ సమయంలో కట్నంగా ఇచ్చిన వ్యవసాయ భూమిని తన బావ, అత్తమామలు ఆక్రమించుకుని తన భర్తను, తనను ఇంటి నుంచి గెంటివేసినట్లు తెలిపింది. తమకు జరిగిన అన్యాయం గురించి పెద్దలలో పెట్టినా న్యాయం చేయకపోగా తనను, తన భర్తను బెదిరిస్తున్నారంటూ వాపోయింది. వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరింది.
● మచిలీపట్నంకు చెందిన కమల అనే వివాహిత తనకు వివాహం జరిగి ఏడు నెలలు అవుతుందని, అడిగినంత కట్న కానుకలు ఇచ్చినా అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటివారు తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయమని ప్రాధేయపడింది.
● తాడిగడపకు చెందిన వినోద్ తనకు వివాహం జరిగి రెండేళ్లు అవుతుందని, వివాహ జీవితంలో ఒక ఆడబిడ్డ కలగగా తన భార్య ఆమె తల్లిదండ్రుల మాటలు విని గొడవలకు దిగుతూ తనపై తప్పుడు కేసులు పెడుతోందని, తనకు న్యాయం చేయమని కోరాడు.
● కోడూరు నుంచి వచ్చిన నరసయ్య అనే వృద్ధుడు తనకున్న వ్యవసాయ భూమిని తన దగ్గర బంధువులకు కౌలుకు ఇచ్చానని, గడిచిన రెండేళ్లుగా కౌలు సొమ్ము ఇవ్వకపోగా అడుగుతుంటే భౌతికదాడికి పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయమని కోరాడు.


