ఇంధన పొదుపుపై అవగాహన అవసరం
అవగాహన ప్రచారం (సక్షమ్ 2025–26) ముగింపు కార్యక్రమంలో భాస్కరరెడ్డి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంధన వనరుల వినియోగం, పొదుపుపై ప్రజల్లో అవగాహన అవసరమని రాష్ట్ర చమురు పరిశ్రమల రాష్ట్ర సమన్వయకర్త ఎన్.భాస్కరరెడ్డి అన్నారు. ఈ నెల 2 నుంచి 16 వరకూ పక్షం రోజుల పాటు నిర్వహించిన ఇంధన వనరుల అవగాహన ప్రచార కార్యక్రమం ముగింపు సమావేశం సోమవారం ఎంజీరోడ్డులోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ సమావేశంలో భాస్కరరెడ్డి మాట్లాడుతూ వివిధ రకాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రజా కేంద్రీకృత కార్యకలాపాల ద్వారా ఇంధన పొదుపుపై అవగాహన కలిగించినట్లు తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల పరిరక్షణ, సమర్థమైన వినియోగం కోసం ఇంధన పొదుపు, అవసరాలు, సమస్యలు, పరిష్కారాలపై పౌరులలో అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో భాగంగా సైక్లోథాన్, వాక్‌థాన్, సీఎన్జీ ఆటో, కార్ ర్యాలీ, ఎల్పీజీ డెలివరీ బాలురకు శిక్షణ కార్యక్రమం, గృహిణులు, పాఠశాల కళాశాల విద్యార్థులకు ఇంధన పొదుపు చిట్కాలపై గ్రూప్ టాక్ వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐఓసీ ఎల్పీజీ డివిజన్స్ హెడ్ టి.భాస్కరరావు, విజయవాడ గెయిల్ డీజీఎం కేఎస్ తివారీ, విజయవాడ ఎల్పీజీ టెరిటరీ మేనేజర్ సీటీ వేణుగోపాల్, హెచ్‌పీ సీఎల్ విజయవాడ రిటైల్ హెడ్ అభిషేక్ ప్రతాప్ సింగ్, పంకజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.


