పరామర్శకు వెళ్తూ అనంతలోకాలకు... | - | Sakshi
Sakshi News home page

పరామర్శకు వెళ్తూ అనంతలోకాలకు...

Feb 15 2026 12:43 PM | Updated on Feb 15 2026 12:43 PM

పరామర్శకు వెళ్తూ అనంతలోకాలకు...

పరామర్శకు వెళ్తూ అనంతలోకాలకు...

కంకిపాడు బైపాస్‌ వెంబడి ఘటన ప్రమాదవశాత్తూ ద్విచక్ర వాహనం పైనుంచి కిందపడిన మహిళ వెనుక నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి

కంకిపాడు: తెలిసిన వారు చనిపోతే పరామర్శించేందుకు వెళ్తున్న ఓ మహిళ అనంతలోకాలకు వెళ్లిపోయిన విషాద ఘటన కంకిపాడు బైపాస్‌లో శనివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరు మండలం వల్లూరు పాలెంకు చెందిన ఆచంట శైలజ (50), కె.శ్రీనివాసరావు భార్యాభర్తలు. కంకిపాడు బస్టాండు సెంటరులో మెడికల్‌ దుకాణం నిర్వహిస్తుంటారు. పెనమలూరు మండలం తాడిగడపలో ఓ మహిళ మరణించడంతో మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆచంట శైలజ తన ద్విచక్ర వాహనంపై పూలదండలతో బయలుదేరింది. ఆమె కంకిపాడు బైపాస్‌మార్గానికి చేరుకునే క్రమంలో రోడ్డు మార్జిన్‌లో ఉన్న ఇసుకలోకి ఆమె వాహనం వెళ్లటంతో జారి ప్రమాదవశాత్తూ కిందపడ్డారు. వెనుకగా కుందేరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆమె మీదుగా దూసుకెళ్లటంతో శైలజ తల నుజ్జు అయ్యి ఘటనాస్థలిలోనే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. అదనపు ఎస్‌ఐ దాసు పర్యవేక్షణలో పోలీసులు మృతదేహాన్ని అంబులెన్సులో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కంకిపాడులో విషాదం

రోడ్డు ప్రమాద ఘటన కంకిపాడులో విషాదం నింపింది. అందరితో కలివిడిగా మసులుతూ, పూజాది కార్యక్రమాలు, అన్నదానాల్లో తన వంతు పాత్ర పోషిస్తూ ఉండే శైలజ హఠాన్మరణం పట్టణ వాసులను కలవరపరిచింది. మృతదేహాన్ని వీక్షించిన స్థానికులు అయ్యోపాపం అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement