కేజీబీవీని ప్రక్షాళన చేస్తాం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
ఎ.కొండూరు: స్థానిక కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని ప్రక్షాళన చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శనివారం ఆ పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకున్నారు. హాస్టల్లో నిద్రించే బాలికలను ఎలుకలు కొరకడం బాధాకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులపై చర్యలకు ఉపక్రమించామని, గత జనవరి 31వరకు ఇక్కడ పనిచేసిన వసతిగృహ ప్రత్యేకాధికారి శ్యామల అలసత్వధోరణి కారణంగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు గుర్తించామన్నారు. ఆమెను విధుల నుంచి తప్పించి ప్రభుత్వానికి సరెండర్ చేశామని కలెక్టర్ వెల్లడించారు. పూర్తి విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు చేపడతామని తెలిపారు. పాఠశాల డార్మెటరీ వెనుక ఉన్న బావి ఎలుకలకు ఆవాసంగా మారిందని, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుపరుస్తామన్నారు.
ఎంపీడీవోకు పర్యవేక్షణ బాధ్యతలు
కస్తూరిబా గాంధీ విద్యాలయ పర్యవేక్షణ బాధ్యతలను ఎ.కొండూరు ఎంపీడీవోకు అప్పగిస్తూ కలెక్టరు ఆదేశాలిచ్చారు. ప్రస్తుత కేజీబీవీ ప్రిన్సిపాల్ విజయ సుందరి పాఠశాల నిర్వహణలో పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎ.కొండూరు తహసీల్దారు అరవింద్, ఎంఈవో కేశవరావు అదికారులు పాల్గొన్నారు.


