చంద్రబాబు అంటేనే కార్పొరేట్ పాలన
ఇచ్చిన ఆరు ప్రధాన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు ఉపాధ్యాయ సంఘం నేతల విమర్శలు
మచిలీపట్నంఅర్బన్: చంద్రబాబు అంటేనే కార్పొరేట్ పాలనని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. బందరులో శుక్రవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్టీయూ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఆరు ప్రధాన హామీల్లో ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా నమ్మగలరని ప్రశ్నించారు. భత్యాలు, బకాయిల చెల్లింపుల్లో స్పష్టమైన నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాట్యూటీ చెల్లింపులపై స్పష్టత లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని తెలిపారు.
25న చలో విజయవాడ
మూడు దశల్లో పోరాట కార్యక్రమాల్లో భాగంగా రెండో దశగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశామన్నారు. మూడో దశగా ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వెంటనే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను పే స్లిప్పుల్లో చూపించి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2004 సెప్టెంబర్ 1కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర శాఖల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మెమో నంబర్ 57 ప్రకారం ఓపీఎస్ తక్షణమే అమలు చేయాలని కోరారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మరుసటి రోజునే పెన్షన్ సౌకర్యాలు అందించాలని, బకాయి ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీకి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.విజయసాగర్, అదనపు కార్యదర్శి డి.చంద్రశేఖర్, రాష్ట్ర కౌన్సిలర్ల కొమ్ము ప్రసాద్, ఎంఈఎస్‌ఎన్ ప్రసాద్, కె.సతీష్‌బాబు, జిల్లా అధ్యక్షులు పి. ఇమాన్యూల్, కార్యదర్శి యూవీ కృష్ణమూర్తి, ఆర్థిక కార్యదర్శి మాధవరావు, రాష్ట్ర కార్యదర్శి డి.విద్యాసాగర్, అర్బన్ అధ్యక్షులు ఎస్.కిరణ్ బాబు, కార్యదర్శి ఎం.వీరబాబు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


