ఆధునిక ఆవిష్కరణలతో మెరుగైన వైద్య సేవలు
వైద్యులకు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి విజయవాడలో ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏపీ చాప్టర్ వార్షిక సదస్సు
పటమట(విజయవాడతూర్పు): వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఆవిష్కరణలను వైద్యులు అందిపుచ్చుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. విజయవాడ గట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏపీ చాప్టర్) 8వ వార్షిక సదస్సు ఏపీ ఈఎస్జీకాన్ 2026 శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఘనంగా ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జీర్ణాశయ సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు ప్రస్తుతం వేగంగా పెరుగుతున్నాయన్నారు. వాటి నిర్ధారణ, చికిత్సల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. కొత్త పద్ధతులు, అత్యాధునిక ఎండోస్కోపీ సాంకేతికతలు, మినిమల్ ఇన్వేసివ్ చికిత్సా విధానాలు రోగులకు తక్కువ నొప్పితో, త్వరితగతిన కోలుకునే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పారు. వైద్యులు నిరంతరం శిక్షణ తీసుకుంటూ, తాజా పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. సదస్సులో గ్యాస్ట్రో ఎంట్రాలజీ, హెపటాలజీ, జీఐ ఎండోస్కోపీ తదితర ముఖ్య అంశాలపై దేశంలోని పలువురు వైద్య నిపుణులు ప్రసంగించారు. జీర్ణాశయ వ్యాధుల నిర్ధారణలో నూతన పద్ధతులు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలో వచ్చిన అభివృద్ధి, క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తింపు, అడ్వాన్స్‌్‌డ్ ఎండోస్కోపిక్ టెక్నిక్స్ వంటి విషయాలపై చర్చలు జరిగాయి. సదస్సులో ఏపీ ఈఎస్జీకాన్ 2026 నిర్వాహక కమిటీ ప్రతినిధులు డాక్టర్ జవ్వాజి సతీష్, డాక్టర్ గోపీకృష్ణ జాలాది, రాజేష్ బత్తిని, రవిశంకర్ తాతా, డాక్టర్ ప్రమోద్ గార్గ్, డాక్టర్ డి.పెదవీర్ రాజు, డాక్టర్ కె.జగన్మోహన్ రావు, డాక్టర్ ఎం.జగన్మోహన్ రావు, డాక్టర్ ఎన్. తిరుమలరావు, డాక్టర్ పి.హరికృష్ణ, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఐ. నళినీ ప్రసాద్, డాక్టర్ ఐ.ఆర్.ఎస్. గిరినాథ్ ఐఎస్జీ ఏపీ ఆఫీస్ బేరర్లు డాక్టర్ ఎం.కవిత, డాక్టర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


