అధికారుల అలసత్వం...సమస్యలు యథాతథం
●దక్షిణకాశీలో నత్తనడకన శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు
●లక్షలాదిగా వచ్చే భక్తులకు
సౌకర్యాలు శూన్యం
పెదకళ్లేపల్లి(మోపిదేవి): దక్షిణకాశీగా పేరొందిన పెదకళ్లేపల్లిలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదిలో పుణ్యస్నానాలు సక్రమంగా సాగేనా అనే అనుమానం భక్తులకు కలుగుతోంది. ఉత్తరవాహినిలో పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండప్రదానాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తోందని భక్తుల అచంచల విశ్వాసం. అందువల్ల ఈనెల 15వ తేదీ మహాశివరాత్రి, 16వ తేదీ రథోత్సవానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ దుర్గానాగేశ్వరస్వామివార్లను దర్శించుకుంటారు. ఈ ఏడాది అధికారుల అలసత్వంతో ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. పెదకళ్లేపల్లిలో ప్రధానంగా రెండు స్నానఘాట్లు ఉండగా, జ్యోతిర్లింగ ధ్యాన క్షేత్రం ఘాట్ వద్ద నదీ ప్రహహానికి కోతకు గురై మెట్లు కొట్టుకుపోయాయి. దీంతో భక్తులు నదిలోనికి దిగటానికి చాలా ఇబ్బందికరంగా మారింది. మెట్ల వెంట మందుబాబులు వదిలేసిన సీసాలు పగిలిపోయి పడి ఉన్నాయి. మహిళలు స్నానాలు అనంతరం దుస్తులు మార్చుకునే రూములకు కనీసం డోర్లు లేవు. పితృదేవతలకు పిండప్రదానం చేసేందుకు గతంలో వేసిన షెడ్డులో కూర్చునే బల్లలు పూర్తిగా పగిలిపోయాయి. అక్కడ పిండ ప్రదానం చేయడం ప్రశ్నార్థకంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు సరైన రహదారి సౌకర్యం లేక నరకం చూస్తున్నారు. ప్రస్తుతం వెంకటాపురం గ్రామం నుంచి పెదకళ్లేపల్లి వరకు ప్రధాన రహదారిపై రోడ్డు వేయడానికి ఉన్న రోడ్డును తవ్వించారు. పక్క డ్రైనేజీలో మట్టితీసి రోడ్డు పక్కన పోయడంతో వాహనదారులకు మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో జరగనున్న మహాశివరాత్రి మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అధికారుల అలసత్వం...సమస్యలు యథాతథం


