మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే లక్ష్యం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి సరైన మార్గదర్శకం, శిక్షణ, వనరులు అందించి ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ (శాప్) చైర్మన్ ఏ.రవినాయుడు, ఎండీ భరణి చెప్పారు. విజయవాడ బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలోని శాప్ ప్రధాన కార్యాలయంలో శాప్ లీగ్స్ అమలు విధానంపై వీడియో కాన్ఫరెన్స్ బుధవారం జరిగింది. రవి నాయుడు మాట్లాడుతూ శాప్ లీగ్స్ కేవలం క్రీడా పోటీలు నిర్వహించే కార్యక్రమంగా మాత్రమే కాకుండా గ్రామ స్థాయి నుంచి క్రీడా సంస్కృతిని బలోపేతం చేసేలా నిర్వహిస్తున్నామన్నారు. ఫిట్‌నెస్, పోషకాహారం, శారీరక సామర్థ్యాల ఆధారంగా క్రీడాకారులను ఎంపిక చేసి, వారికి క్రీడా కిట్లు, అవసరమైన పరికరాలు, ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా వారిని క్రీడా అకాడమీలతో అనుసంధానం చేసి నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.
32 విభాగాల్లో..
శాప్ ఎండీ ఎస్. భరణీ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో మొత్తం 32 క్రీడా విభాగాల్లో శాప్ లీగ్స్ నిర్వహిస్తున్నామని, ఈ లీగ్స్ ద్వారా రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి రావడం ఖాయమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. శాప్ ఏవో ఆర్.వెంకట రమణ నాయక్, క్రీడా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శాప్ చైర్మన్ రవి నాయుడు, ఎండీ భరణి


