ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లపై అవగాహన పెంపొందించుకోవా లని సూచించారు. కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులతో కలిసి ఆర్‌బీఐ – ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల (ఫిబ్రవరి 9 నుండి 13 వరకు) పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందేందుకు కూడా అవగాహన అవసరమన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తన, బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డీఎం కె.ప్రియాంక, జీఎం డీఐసీ మధు, ఎస్‌బీఐ కోఆర్డినేటర్ జగదీష్, కెనరా బ్యాంక్ కోఆర్డినేటర్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


