సమస్యలకు సత్వర పరిష్కారం
‘మీ కోసం’లో అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు
కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో అందిన అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో సిబ్బంది చొరవ చూపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘మీ కోసం’లో మొత్తం 40 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● కూచిపూడి నుంచి విశ్వేశ్వరరావు అనే వ్యక్తి వచ్చి తన వ్యవసాయ భూమిని సరిహద్దుదారుడు ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని, అదేమని అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు దిగుతున్నాడంటూ వాపోయారు. అతనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని అర్జీ సమర్పించారు.
● కంకిపాడు నుంచి కవిత అనే వివాహిత.. తనకు వివాహం జరిగి నాలుగేళ్లు అవుతోందని, అదనపు కట్నం కోసం తన భర్త, అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయమని వినతి పత్రం సమర్పించారు.
● ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన స్నేహితుడు మోసం చేశాడని, ఉద్యోగం నిమిత్తం ఇచ్చిన డబ్బు ఇవ్వకపోగా బెదిరిస్తున్నాడని న్యాయం చేయమని గుడివాడకు చెందిన నాని అనే యువకుడు ఫిర్యాదు చేశారు.


