బాలుడి మృతిపై ఆర్డీఓ విచారణ
మచిలీపట్నంఅర్బన్: గురుకుల పాఠశాల విద్యార్థి మృతి ఘటనపై బందరు ఇన్‌చార్జి ఆర్డీఓ పోతురాజు ఆదివారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల ఆర్థిక సహాయం, రెండు సెంట్ల స్థలం, కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గురుకులం యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందినట్లు విమర్శలున్నాయి. చెరువులో నుంచి బాలుడిని బయటకు తీసే సమయంలో ప్రాణం ఉన్నట్టు తెలిసినా, లైఫ్ సపోర్ట్ సదుపాయాలతో ఉన్న అంబులెన్స్‌ను ఏర్పాటు చేయలేదు. అత్యవసర పరిస్థితిలో బాలుడిని ఐదు కిలోమీటర్ల దూరం నలుగురు ఒకే బైక్‌పై తరలించడంపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. విచారణ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్ బాబా, జేడీ ఐ. శ్రీదేవి, కృష్ణా–ఎన్టీఆర్ జిల్లాల గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ ఎ. మురళీకృష్ణ, తహసీల్దార్ మధుసూదనరావు, ఎంఈ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు నాగరాజు, సత్యనారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు బూర పూజిత, ఎస్.సమరం, విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల్లో ఆందోళన..
ఆదివారం గురుకులంలో పేరెంట్స్ మీట్ ఉండడంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో గురుకులానికి వచ్చారు. సంఘటనా తెలుసుకున్న వారు విద్యార్థుల భద్రతపై ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీసుల రంగ ప్రవేశంతో ఆందోళన సద్దుమనిగింది.


