సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాలు దాడిచేసిన విషయం విదితమే. దాడి చేయడంతోపాటు పెట్రోలు బాంబులు విసిరి ఇంటికి నిప్పంటించారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు బయలుదేరతారు. కనకదుర్గ వారధి, ఎం. హోటల్, సత్యంగారి హోటల్ సెంటర్, ఆర్టీసీ బస్‌స్టాండు, రాజీవ్ గాంధీపార్క్, కనకదుర్గ ఫ్లై ఓవర్, స్వాతిసెంటర్, దర్గాసెంటర్, గొల్లపూడి వై–జంక్షన్, వన్‌సెంటర్, గుంటుపల్లి, తుమ్మల పాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తిరిగి మధ్యాహ్నం తాడేపలిలోన్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. జగన్ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురాం పరిశీలించారు. జోగి రమేష్ నివాసానికి వెళ్లి ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించారు.
కల్పవల్లికి జేజేలు
ఉయ్యూరు: వీరమ్మ తల్లీ పాహిమాం అంటూ కల్పవల్లికి విశేష పూజలు చేశారు. వీరమ్మ తిరునాళ్ల మహోత్సం కోలాహలంగా సాగుతోంది. పిన్న, పెద్ద సందడి చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే భక్తులు కనక చింతయ్య సమేత వీరమ్మతల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాల పొంగళ్లను అమ్మకు నైవేద్యంగా సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల నుంచి భక్తజనం డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తరలివచ్చి కోళ్లు, పొట్టేళ్లను తల్లికి కానుకగా సమర్పించి భక్తి పారవశ్యం చెందారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, న్యాయాధికారులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించారు.
‘పది’ తత్కాల్ ఫీజు చెల్లింపునకు గడువు పెంపు
మచిలీపట్నంఅర్బన్: ఎస్‌ఎస్‌సీ(టెన్త్, ఓఎస్‌ఎస్‌సీ, వృత్తి విద్యా (ఒకేషనల్) పబ్లిక్ పరీక్షల తత్కాల్ ఫీజు చెల్లింపునకు గడువు పెంచినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్ విధానంలో వెయ్యి రూపాయల ఆలస్య రుసుంతో పరీక్ష ఫీజు చెల్లింపు, సంబంధిత పత్రాలతో ఎన్‌ఆర్ ఆన్‌లైన్ సమర్పణకు ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు గడువు నిర్ణయించినట్లు వివరించారు.. ఫీజును హెడ్‌మాస్టర్ మాత్రమే రిమిట్ చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మార్చి 2026 ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలకు నమోదు చేసుకున్న విద్యార్థులకే 2026 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అర్హత ఉంటుందని వివరించారు. అర్హులైన విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లింపులు పూర్తి చేయాలని డీఈఓ విజ్ఞప్తి చేశారు. పది తరోగతి పరీక్షల కోసం విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు పొందాలని ఆయన సూచించారు.
నేడు ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన


