బ్రహ్మోత్సవాలకు ‘హంసలదీవి’ ముస్తాబు
రేపటి నుంచి వేణుగోపాలుడి కల్యాణోత్సవాలు
కోడూరు: హంసలదీవి క్షేత్రం బ్రహ్మోత్సవ శోభతో ఉట్టిపడుతోంది. గ్రామంలోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి స్వామివార్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దేశంలోని 56 వైష్ణవ ఆలయాలను దేవతలే నిర్మించారని పురాణాలు చెబుతుండగా, అందులో హంసలదీవి క్షేత్రం కూడా ఉంది. అంతటి మహిమా న్వితమైన క్షేత్రంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు శృంగేరీ పీఠం ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్‌దీపాలతో అలంకరిస్తున్నారు. ఆలయ విశిష్టతను వివరిస్తూ ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆలయ ధర్మాధికారి, టీటీడీ వేదపాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా సుబ్రహ్మణ్య అవధాని తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
ఉత్సవాలు ఇలా..
● 30న ఉదయం స్వామివారికి విశేషస్నపన, పెళ్లి కుమారుడిగా అలంకరణ, సాయంత్రం విష్వక్సేన పూజ, పుణ్యావచనం, దీక్ష స్వీకరణ, అఖండ దీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, అంకురార్పణ, ధ్వజారోహణ.
● 31న ఉదయం బలిహరణ, పంచామృతస్నపన, పాలాభిషేకం, శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారికి లక్షకుంకుమార్చన, సాయంత్రం నిత్యహోమం, జగజ్యోతి, ఆలయంలోని ఆరుబయట ఉన్న కల్యాణ వేదికలో రాత్రికి స్వామివార్ల కల్యాణం.
● ఫిబ్రవరి 1న ఉదయం సాగరసంగమం, పాలకాయతిప్ప బీచ్ వద్ద సింధుస్నానాలకు వచ్చే భక్తులతో ప్రత్యేక పూజలు, రాత్రికి స్వామివారి రథోత్సవం.
● 2న అవభృదోత్సవం, సాయంత్రం ధ్వజారోహణం, పూర్హాహుతి, రాత్రికి స్వామివారి పవళింపు సేవతో ఉత్సవాలను ముగుస్తాయి.
బ్రహ్మోత్సవాలకు ‘హంసలదీవి’ ముస్తాబు


