మంచి గురువులుగా నడుచుకోండి
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
పెడన: విద్యార్థుల మదిలో మంచి గురువులుగా నడుచుకోవాలని, ప్రాథమిక స్థాయి నుంచి హైస్కూలుకు వెళ్లిన తరువాత అక్కడ బేసిక్స్ కూడా రాకపోతే ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు ఏం చెప్పలేదనే అంతా అనుకుంటారని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన పెడన పట్టణంలోని ఎంపీపీ(బంగ్లా)స్కూలును ఆకస్మికంగా సందర్శించారు. తొలుత ఆయన ఎంఈవో చాంబరులో కూర్చొని తరగతుల వారీగా అటెండెన్సు పుస్తకాలను పరిశీలించి, హాజరైన విద్యార్థుల్లో కొందరిని పిలిపించుకుని వారి విద్యా సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. గణితంలో కూడికలు, తీసివేతలు చెప్పి అంకెలు వేయించి వారి ప్రతిభను పరిశీలించారు. అలాగే తెలుగు, ఇంగ్లీష్ పదాలను రాయడం, చదవించడం చేయించారు. కొంత మంది విద్యార్థుల ప్రతిభను పరిశీలించిన ఆయన అనంతరం హెచ్‌ఎం భాగ్యలక్ష్మీతో పాటు పాఠశాలలోని ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులను మీ పిల్లలుగా భావించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వ్యక్తిగతంగా వారిని తీర్చిదిద్దాలని సూచించారు. డీఈవో యూవీ సుబ్బారావు, ఎంఈవో–1, 2 ఎన్ సలోమి, వైవీ హరనాథ్, ఇన్‌చార్జి తహసీల్దార్ కె. అనిల్‌కుమార్ తదితరులున్నారు.
టీచర్‌గా మారిన కలెక్టర్..
గుడ్లవల్లేరు: కలెక్టర్ డీకే బాలాజీ టీచర్‌గా మారి.. విద్యార్థులకు పాఠాలు చెప్పారు. బుధవారం మండలంలోని వడ్లమన్నాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులతో పరీక్షల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. డీఈఓ సుబ్బారావు, ఎంఈవో జి.జగన్మోహనరావు పాల్గొన్నారు.


