వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు పొందిన లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎం. నాయక్ సూచించారు. బుధవారం సాయంత్రం ఆయన స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీతో కలిసి ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ.. 2015–16 నుంచి 2018–19 సంవత్సరాల మధ్య రుణాలు పొందిన 2025 డిసెంబర్ 31వ తేదీ నుంచి 2026 ఏప్రిల్ 30వ తేదీ వరకు రుణం మొత్తం చెల్లించిన వారికి వడ్డీ మాఫీ వర్తిస్తుందన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. తీసుకున్న రుణానికి వడ్డీ కాకుండా అసలు మాత్రమే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ కృష్ణవేణి, ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఈడీ జి.రమేష్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షాహిద్‌బాబు, గిరిజన సంక్షేమాధికారి ఫణిదూర్జటి పాల్గొన్నారు.


