చిన్న తప్పు.. ప్రాణాలకు ముప్పు
మానవ పొరపాట్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు కారణం రోడ్డు ప్రమాద మృతుల్లో ద్విచక్ర వాహనదారులే ఎక్కువ హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్ వినియోగంతో ప్రాణాలకు రక్షణ జాతీయ రోడ్డు భద్రత మాసం సందర్భంగా రవాణా శాఖ అవగాహన కార్యక్రమాలు
అతిక్రమిస్తే శిక్షలు ఇలా...
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు ఇటీవల రాత్రి పది గంటలకు కారులో బయలుదేరి ఉయ్యూరు వెళ్లారు. అక్కడ అర్ధరాత్రి సమయంలో మరో యువకుడిని ఎక్కించుకుని విజయవాడ వైపు వస్తుండగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో నలుగురు యువకులు మృతి చెందారు. ఈ ఘటనకు మీతిమీరిన వేగమే కారణం. అమరావతిలోని ఒక విశ్వ విద్యాలయానికి చెందిన విద్యార్థులు పుస్తకాల కొనుగోలుకు విజయవాడ వచ్చారు. పీవీపీ మాల్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను మీతిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ రెండు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరిగినవే. ఇవే కాదు రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. చిన్నపాటి పొరపాటుతో మనతో పాటు, రోడ్డుపై వెళ్లే ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. అప్రమత్తంగా ఉంటే ప్రాణాలకు భద్రత అంటూ రవాణాశాఖ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
రెండేళ్లలో ప్రమాదాలు ఇలా..
ఎన్టీఆర్ జిల్లాలో 2024లో 1,148 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 431 మంది మృతిచెందారు. మరో 1,159 మంది గాయాలపాలయ్యారు. 2025వ సంవత్సరంలో 917 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 366 మంది మృతి చెందారు. 911 మంది గాయాల పాలయ్యారు. 2025 సంవత్సరంలో ప్రమాదాల్లో మృతి చెందిన వారిలో అత్యధికంగా ద్విచక్రవాహనదారులు 209 మంది, పాదచారులు 107 మంది మృతి చెందారు. వాహనాలు నడిపేటప్పుడు చేసే చిన్న తప్పులే శాపాలుగా మారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే భద్రత
రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని రవాణాశాఖ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. అందులో భాగంగా శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన నినాదంతో అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది. మద్యం మత్తులో వాహనాలు నడుపకూడదు. ర్యాష్ డ్రైవింగ్ , సిగ్నల్ జంపింగ్ నేరం. పరిమితికి మంచి ఆటోల్లో ప్రయాణించరాదు. కారు నడిపేటప్పుడు కచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడం అంత్యంత ప్రమాదకరమని రవాణాశాఖ అధికారులు అవగాహన కలిగిస్తున్నారు.
నిబంధనలు అతిక్రమించిన వారికి అధికా రులు జరిమానాలు విధిస్తున్నారు. బడిబస్సులు, ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ జరిమానా విధిస్తున్నారు. ఇటీవల పలువురికి జైలు శిక్షలు విధించారు. ర్యాష్ డ్రైవింగ్‌చేస్తే రూ.5 వేల జరిమానా, ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణికులు వెళ్తుంటే కేసులు నమోదు వంటివి చేస్తున్నప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదు. ఏదైనా ఆటో ప్రమాదం జరిగితే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇటీవల చూశాం.


