కనెక్షన్‌.. కలెక్షన్‌ | - | Sakshi
Sakshi News home page

కనెక్షన్‌.. కలెక్షన్‌

Jan 28 2026 8:42 AM | Updated on Jan 28 2026 8:42 AM

కనెక్షన్‌.. కలెక్షన్‌

కనెక్షన్‌.. కలెక్షన్‌

కనెక్షన్‌.. కలెక్షన్‌ విద్యుత్‌ శాఖలో వసూల్‌ రాజాలు

అమ్మో ఆ ఏఈనా?

విద్యుత్‌ శాఖలో వసూల్‌ రాజాలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): సాగు నీరు ఉంటే ఎటువంటి నేల అయినా సారవంతం అవుతుంది. మూడు పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఆ సాగు నీటి అవసరాలు తీర్చుకునేందుకు రైతులు అప్పో సొప్పో చేసి బోర్లు వేస్తున్నారు. బోర్లు వేసిన రైతులు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కనెక్షన్‌ తీసుకోవడం పెద్ద ప్రహసనంగా మారింది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ (ఏజీఎల్‌) మంజూరు చేసేందుకు కొందరు అధికారులు రేటు నిర్ణయించి రైతుల నుంచి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తు చేసిన రైతులు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. విద్యుత్‌ శాఖ వద్ద దరఖాస్తులు వేలల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

2,293 దరఖాస్తులు పెండింగ్‌

ఏపీసీపీడీఎసీల్‌ విజయవాడ సర్కిల్‌ పరిధిలోని ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ రూరల్‌, టౌన్‌, గుణదల, నూజివీడు డివిజన్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 57,763 (జూన్‌, 2025 వరకు) వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. కొత్తగా బోర్లు వేసి విద్యుత్‌ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటివరకు 2,293 దర ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గుణదల డివిజన్‌ పరిధిలో మూడు, నూజివీడు డివిజన్‌ పరిధిలో 1,669, విజయవాడ రూరల్‌ డివిజన్‌ పరిధిలో 619, విజయవాడ టౌన్‌ డివిజన్‌ పరిధిలో రెండు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కనెక్షన్‌ కోసం విద్యుత్‌ శాఖ నిర్ధేశించిన మొత్తాన్ని రైతులు ఇప్పటికే చెల్లించారు. అయినప్పటికీ కనెక్షన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొన్ని చోట్ల ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

గత జూలై నుంచి ఇదే తంతు

ముఖ్యంగా విజయవాడ రూరల్‌ డివిజన్‌ పరిధిలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు, కంచికచర్ల, వీరులపాడు, జి. కొండూరు, మైలవరం, నూజివీడు డివిజన్‌ పరిధిలోని తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, చాట్రాయి, రెడ్డిగూడెం మండలాల్లో బోర్లపై వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉన్నారు. వత్సవాయి మండలంలో 180 వరకు విద్యుత్‌ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. రెడ్డిగూడెం, విస్సన్నపేట, చాట్రాయి మండలాల్లోనూ ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌ ఉన్నాయి. గత ఏడాది జూలై నుంచి కొత్త కనెక్షన్ల మంజూరు నత్తనడకన జరుగుతోంది. 2023 సంవత్సరం చివరి నుంచి దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పటికీ కనెక్షన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

కనెక్షన్‌కు రూ.80 వేలకు పైనే..

రైతుల అవసరాలను విద్యుత్‌ శాఖలోని కొందరు అధికారులు ఆసరాగా తీసుకొని వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. అడిగినంత ఇవ్వని వారికి రకరకాల కారణాలతో కనెక్షన్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. సాంకేతిక కారణాలు చూపి తిరస్కరిస్తున్నారు. కొందరు రైతులు క్షేత్ర స్థాయి అధికారులకు డబ్బులు ఇచ్చి కూడా కనెక్షన్‌ కోసం తిరుగుతున్నారు. సాగర్‌ జలాలు అందక పోవడం, వాతావరణ అననుకూల పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు కొందరు రైతులు అప్పో సొప్పో చేసి అధికారులు అడిగినంత సమర్పిస్తున్నారు. ఒక్కో కనెక్షన్‌కు రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు వినికిడి.

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌

కోసం భారీగా వసూళ్లు

అడిగినంత ఇవ్వకపోతే కనెక్షన్‌ కష్టం

సాంకేతిక కారణాలు చూపి జాప్యం

పెరిగిపోతున్న పెండింగ్‌ జాబితా

విజయవాడ రూరల్‌ డివిజన్‌, నందిగామ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఒక ఏఈ గురించి రైతులు కథలు కథలుగా చెబుతున్నారు. డబ్బులు ఇస్తే దరఖాస్తుతో పనిలేకుండానే కనెక్షన్‌ ఇచ్చేస్తారని, ఇందుకోసం ప్రతి ఊరిలో మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారని రైతులు బాహాటంగానే చెబుతున్నారు. అడిగినంత ఇవ్వక పోతే నిబంధనలు చూపి సాంకేతిక కారణాలతో అడ్డుకున్నారని వాపోతున్నారు. రెండేళ్ల క్రితం ఒక రైతుకు పొలానికి కనెక్షన్‌ పేరుతో స్తంభాలు తరలించి వదిలేశారని, కనెక్షన్‌ అడిగితే అదిగో ఇదిగో అంటూ దాట వేత సమాధానాలు ఇస్తున్నారని వివరిస్తున్నారు. లోడ్‌ను బట్టి ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు ఇన్ని కనెక్షన్లు అని ఇస్తారు. ఓ మహిళ వద్ద రూ.20 వేలు తీసుకుని నేరుగా కనెక్షన్‌ ఇచ్చేసి జేబులు నింపుకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

విస్సన్నపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో మూడు సెక్షన్‌లు ఉన్నాయి. వీటిలో బోర్లు, మామిడి తోటలు అధికంగా ఉండే ఓ సెక్షన్‌లో పనిచేస్తున్న ఇంజినీర్‌ లీలలు అన్నీఇన్ని కావు. అధికార పార్టీ నేతల గెస్ట్‌ హౌస్‌లకు అక్ర మంగా విద్యుత్‌ సౌకర్యం కల్పించడం. చేపల చెరువులకు కనెక్షన్‌ల పేరుతో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మెటీరియల్‌ దుర్వినియోగం, ట్రాన్స్‌ఫార్మర్ల, కేబుల్‌ అక్రమ తరలింపు, ఏజీఎల్‌ కనెక్షన్లకు డబ్బులు వసూలు చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈయన అవినీతి భాగోతంపై నేరుగా కొందరు సీఎండీకి ఫిర్యాదులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement