డ్రగ్స్ వాడితే జీవితాలు నాశనం
లబ్బీపేట(విజయవాడతూర్పు): యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఆ మహమ్మారి బారిన పడితే జీవితాలు నాశనం అవుతాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై దండయాత్ర పేరుతో ఐదుగురు మహిళా పోలీసులు నిర్వహించనున్న సైకిల్ యాత్రను మంగళవారం హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగిన సభలో సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గంజాయిని రాష్ట్రంలో సమూలంగా నిర్మూలించేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. గంజాయి సాగు చేసే వారు ప్రయత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. డ్రగ్స్‌పై దండయాత్ర పేరుతో ఐదుగురు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్రజలు సైతం అవగాహనతో మెలగాలని సూచించారు. తొలుత జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు వివరించారు.
సైకిల్ యాత్ర ఇలా..
కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఉమెన్ ఎస్‌ఐ కడలి రేవతి, హెడ్ కానిస్టేబుల్ గుమ్మడి హైమావతి, కానిస్టేబుళ్లు షేక్ బీబీ శైలజ, చేపు త్రివేణి, వాయిబోయిన ఉషారాణి జిల్లా వ్యాప్తంగా సైకిల్‌పై ప్రయాణిస్తూ డ్రగ్స్‌పై అవగాహన కల్పించను న్నారు. మార్చి ఒకటో తేదీ వరకు 510 కిలో మీటర్లు ప్రయాణిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, కలెక్ట్టర్ లక్ష్మీశ, ఈగల్ ఐజీ ఆర్.కె.రవికృష్ణ, డీసీపీలు కృష్ణ కాంత్ పటేల్, కె.జి.వి.సరిత, షేక్ షిరీన్‌బేగం, పలువురు పోలీసులు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం బందరు రోడ్డులో ట్రాఫిక్‌ను మళ్లించారు.
వైద్యశాఖ మంత్రి
సత్యకుమార్ యాదవ్
డ్రగ్స్ వాడితే జీవితాలు నాశనం


