మాతృ మరణాల నివారణకు చర్యలు చేపట్టండి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో మాతృమరణాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ప్రసూతి మరణాలపై ఆయన మంగళవారం సమీక్షించారు. జిల్లాలో రెండు ప్రసూతి మరణాల కేసులను విచారించి, అందుకు కారణాలు, వారికి చికిత్స చేసిన వైద్యులు, ఘటన వివరాలను బాధితుల బంధువులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. వైద్య, సమగ్ర శిశు అభివృద్ధి సేవల శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ మాతృ మరణాలు నివారణకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా హైరిస్క్ ప్రగ్నెంట్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిష్కరించలేని సమస్య ఉత్పన్నమైతే వెంటనే వారికి తెలపాలని తద్వారా సమయం వృథా కాకుండా మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు తమ పరిధిలోని గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందు తున్నప్పటికీ సమయానికి అవసరమైన వైద్యపరీక్షలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతున్నదీ, లేనిదీ ఆరా తీయాలన్నారు. గర్భిణుల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ యుగంధర్, డీసీహెచ్‌ఎస్ శేషుకుమార్, ఇమ్యూనైజేషన్ అధికారి ప్రేమ్‌చంద్, జీజీహెచ్ డెప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.


