వేగవంతం చేయండి
తాగునీటి పథకాల పనులను
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని రక్షిత తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. తాగునీటి పథకాల పనులను వేగవంతం చేయాలని సూచించారు. క్లోరినేషన్, క్లీనింగ్ బైలాజికల్ టెస్టులు నిర్వహించిన తర్వాత మాత్రమే తాగునీటిని సరఫరా చేయాలని స్పష్టంచేశారు. తాగునీటి పథకాల నిర్వహణ, సురక్షిత మంచినీటి సరఫరా, గ్రామీణ నీటి సరఫరా పథకాల పనుల ప్రగతిపై కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. తాగునీటి సరఫరా పథకాలపై నిరంతర పర్యవేక్షణ చేసి పరిశుభ్రమైన నీటిని మాత్రమే సరఫరా చేయాలని సూచించారు. ప్రతి నెల బైలాజికల్ టెస్టులు నిర్వహించా లని, ఎప్పటికప్పుడు ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాలని, అధికారులు సమన్వయంతో తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సరఫ రాలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలలు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీల్లో తాగునీటి టెస్టులకు సంబంధించిన తేదీ, నివేదిక వివరాలను పొందుపరుస్తూ తప్పనిసరిగా డిస్ ప్లే బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు.
433 పనులు పూర్తి
జిల్లాలో తాగునీటి సరఫరా చేసేందుకు జలజీవన్ మీషన్ పథకం ద్వారా 534 పనులను మంజూరయ్యాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వీటిలో 433 పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మరో 101 పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలసత్వం వహించే కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటి సరఫరాలో సాంకేతిక సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అపరేషన్స్ అండ్ మెయింటినెన్స్ (ఓఅండ్‌ఎం) పెండింగ్ పనులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలన్నారు. అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టి పైపులైన్ల లీకేజీలు లేకుండా చూడాలని, పంపు హౌస్, మోటార్లు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ సీహెచ్.తిరుమల కుమార్, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి, డీఈఓ చంద్రకళ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డీపీఓ లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.


