ప్రగతి సూచికల్లో ఎన్టీఆర్ ప్రథమం
పాలనలోనూ, సేవల్లోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)లో జిల్లాను రెండో స్థానంలో నిలపాలి డీఆర్‌సీ సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి 315 కీలక ప్రగతి సూచిక (కేపీఐ)ల్లో 83 స్కోరుతో జిల్లా రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని జిల్లా ఇంచార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఫ్రంట్ రన్నర్‌గా ఉన్న జిల్లా ఏ ప్లస్ అచీవర్ స్థాయికి చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పాలనలోనూ, సేవల పంపిణీలోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ స్ఫూర్తితో పని చేయాలన్నారు. శుక్రవారం మంత్రి సత్యకుమార్ అధ్యక్షతన నగరంలోని ఇరిగేషన్ కాంపౌండ్ రైతు శిక్షణ కేంద్రంలో 4వ జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌ఎం తదితరులు హాజరయ్యారు. గత డీఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన వివిధ అంశాలపై తీసుకున్న చర్యలపై అధికారులను వివరణ కోరారు. పరిశ్రమలు, వైద్య ఆరోగ్యం, రహదారులు, శాంతి భద్రతలు, పోలీస్ కమిషనరేట్ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు, పీఎం సూర్యఘర్ తదితరాలపై సమావేశంలో చర్చించారు. విజయవాడ రూరల్ పరిధిలో సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధుల కట్టడి, ఎ.కొండూరు కిడ్నీ వ్యాధిగ్రస్థులకు అందిస్తున్న సేవలు తదితరాలకు సంబంధించి అధికారులు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ రెవెన్యూ సేవల దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.
జీడీడీపీలో జిల్లాను ముందు వరుసలో నిలపాలి..
సమావేశం అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..గత సమావేశంలోని 61 అంశాలకు సంబంధించి 11 అంశాల పరిష్కారం పూర్తయిందన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)లో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఉపాధి కల్పనకు, ఆర్థిక వృద్దికి ఊతమిచ్చే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులతో పాటు ప్రతి మండలంలోనూ చిన్న పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చొరవ చూపుతున్నట్లు తెలిపారు.
కృష్ణా జలాల పంపిణీపై ట్రయల్ రన్..
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎ.కొండూరులో ప్రతివారం నెఫ్రాలజిస్టు వైద్య సేవలను అందిస్తున్నామని, ఇందుకు సంబంధించి గిరిజన తండాల్లో టాంటాం కూడా వేయిస్తున్నామని తెలిపారు. కృష్ణా జలాల పంపిణీపై ట్రయల్ రన్ జరుగుతోందని.. త్వరలోనే పూర్తిస్థాయిలో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదనపు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురాం, డీసీపీ కేజీవీ సరిత, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో వై.శ్రీలత, జెడ్‌పీ సీఈవో కె.కన్నమనాయుడు, ఆర్‌డీవోలు కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి సూచికల్లో ఎన్టీఆర్ ప్రథమం


