
నిత్యాన్నదానానికి పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు మంగళవారం విరాళాలను సమర్పించారు. పెనమలూరు మండలం కానూరు చనుమోలురావు నగర్‌కు చెందిన కొల్లి మోహనకృష్ణారెడ్డి, కొల్లి వీరవెంకటశివ ప్రసాద్‌రెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి శర్వరెడ్డి పేరిట రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. రామవరప్పాడుకు చెందిన కడియాల శాంతి సుభాష్ పేరిట నిత్యాన్నదానానికి రూ.1,00,008ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.