
పిల్లల ఆరోగ్య రక్షణలో మరో ముందడుగు
ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ
మచిలీపట్నం అర్బన్: పిల్లల ఆరోగ్య రక్షణలో మరో అడుగు ముందుకు వేశామని ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం నివారించటం, పాఠశాల డ్రాప్ అవుట్లను తగ్గించడమే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (ఎన్డీడీ) ప్రధాన లక్ష్యమన్నారు. చిలకలపూడి పాండురంగ మునిసిపల్ హైస్కూల్‌లో మంగళవారం రెండో రౌండ్ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. స్వయంగా విద్యార్థుల చేత మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 99 శాతం మందుల పంపిణీ చేశామన్నారు. ఆగస్టు 20న మాప్‌అప్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఏటా మార్చి, ఆగస్టు నెలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రోగనిరోధక శక్తి మెరుగు..
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శర్మిష్ఠ మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలతో పిన్ వారమ్స్, రౌండ్ వారమ్స్, టేప్ వారమ్స్ వంటి పేగు పరాన్నజీవులను నిర్మూలించవచ్చన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్ మాట్లాడుతూ నులిపురుగుల నిర్మూలనతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పోషకాహార శోషణ మెరుగుపడుతుందన్నారు. ఆల్బెండజోల్ అంగన్‌వాడీ కేంద్రాలు, అన్ని పాఠశాలలు, జూనియర్, సాంకేతిక కళాశాలల్లో 1–19 ఏళ్ల పిల్లలందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానిటరింగ్ అధికారి డాక్టర్ మాలిని, ఆర్‌బీఎస్‌కే పీఓ డాక్టర్ కె. హిమబిందు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.