
పోతే.. పొమ్మనండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉంటే ఉండమనండీ.. పోతే పోమ్మనండీ ఎవరి కోసం వచ్చారు. ఏఆర్‌టీలో సిబ్బంది లేకుంటే నేనేమి చేస్తాను. వచ్చే వరకూ ఉండమనండీ అంటూ హెచ్‌ఐవీ బాధితుల పట్ల డీఎల్‌ఓ అమానుషంగా మాట్లాడారు. అసలు నీవు నాకెందుకు ఫోన్ చేశావు, నీ కేడర్ ఏమిటీ అంటూ విషయాన్ని ఆయనకు చెప్పేందుకు ఫోన్ చేసిన ప్రభుత్వాస్పత్రి నోడల్ ఆఫీసర్‌ను నోటికొచ్చినట్లు అనడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఈ విషయం సోమవారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. హెచ్‌ఐవీ రోగులకు అందించే సేవలను పర్యవేక్షించాల్సిన అధికారే అలా బాధ్యతా రహితంగా వ్యవహరించడం ఏమిటనీ పలువురు అధికారులు అంటున్నారు. ఆయన తీరు నిత్యం వివాదస్పదంగా మారుతోందని వైద్యశాఖలోని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు.
అసలేమి జరిగిందంటే..
తిరువూరు నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతం నుంచి హెచ్‌ఐవీ బాధితులు మందుల కోసం కొత్తాస్పత్రిలోని ఏఆర్‌టీ కేంద్రానికి వచ్చారు. అక్కడ గంట సేపు కూర్చున్నా వారికి కార్డులు ఇచ్చే కో ఆర్డినేటర్ రాలేదు. దీంతో తిరిగి వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని, అక్కడి సిబ్బందిని ఎంత బతిమిలాడినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సూపరింటెండెంట్ చాంబర్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న అభయ్ నోడల్ అధికారిని కలిసి వివరించారు. దీంతో ఆయన ఏఆర్‌టీ కేంద్రాలను పర్యవేక్షించే డీఎల్‌ఓకు ఫోన్ చేసి విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా అసలు నాకు ఫోన్ చేయడానికి నీవు ఎవరూ, నీ కేడర్ ఏమిటీ, నాకెందుకు ఫోన్ చేశావంటూ చివాట్లు పెట్టారు. అయినా సిబ్బంది లేకపోతే వచ్చేదాకా కూర్చోమనండీ, లేకపోతే పొమ్మనండీ అంటూ అమానుషంగా మాట్లాడారు. దీంతో ఆ నోడల్ అధికారి చిన్నబుచ్చుకోవడమే కాకుండా, రోగి సైతం చేసేది ఏమి లేక, మళ్లీ ఏఆర్‌టీ దారి పట్టారు. ఓ గంట తర్వాత కానీ సిబ్బంది రాలేదు.
గతంలో పనిచేసిన చోట్ల అంతే..
జిల్లాలో పనిచేస్తున్న డీఎల్‌ఓ గతంలో ఏలూరులో పనిచేస్తున్న సమయంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కోవిడ్‌లో పనిచేయని వారికి సైతం చేసినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, అనుభవం పత్రాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా అనంతరం భీమవరంలో పనిచేసిన సమయంలో రెండు నెలలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా చేసి అవినీతికి పాల్పడటంతో, ఆ పోస్టు నుంచి తప్పించినట్లు వైద్యశాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేయడం, ఇతరులపై పెత్తనం చేలాయించాలని చూడటం అతని నైజమని సిబ్బంది వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో జిల్లా వైద్య శాఖ పరువు బజారున పడటం ఖాయమంటున్నారు.
మా కోసం వచ్చారా..
ఉండక ఏమి చేస్తారు
హెచ్‌ఐవీ రోగుల పట్ల
డీఎల్‌ఓ అమానుష ప్రవర్తన
ప్రభుత్వాస్పత్రి నోడల్ అధికారిపై చిందులు
నిత్యం వివాదస్పందంగా
మారుతున్న డీఎల్‌ఓ తీరు
గతంలో పనిచేసిన చోట్ల
అనేక అవినీతి ఆరోపణలు
ఆయన ప్రవర్తన
నిత్యం వివాదస్పదమే..
నెలన్నర కిందట జరిగిన బదిలీల్లో జిల్లాకు వచ్చిన డీఎల్‌ఓ ప్రవర్తన వివాదస్పదంగా మారుతుంది. అంతేకాకుండా, ఆయన విధులు ఆయన చేయకుండా, డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో చేసే ఇతర వైద్యులపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడంటూ పలువురు ఆరోపించారు. రెండు రోజుల కిందట సీనియర్ వైద్యుడైన డీఎంఓను కూడా ఇలాగే మాట్లాడారని, డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పనిచేసే వైద్యుల పట్ల అమానుషంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా పనులు సాగుతున్నాయని, ఇప్పుడు డీఎల్‌ఓ తీరు నిత్యం వివాదంగా మారుతున్నట్లు వాపోతున్నారు.
నా దృష్టికి వచ్చింది..
డీఎల్‌ఓ చులకనగా మాట్లాడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇంకా డీఎల్‌ఓ అలాగే ప్రవర్తిస్తే కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తా. ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనపై కూడా వివరాలు తెలుసుకుంటా.
– డాక్టర్ ఎం.సుహాసిని,
డీఎంహెచ్‌ఓ, ఎన్టీఆర్ జిల్లా