
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఎస్పీ జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమస్య ఎలాంటిదైనా చట్ట పరిధిలో విచారణ జరిపించి పరిష్కరిస్తామన్నారు. న్యాయం కోరుతూ వచ్చే బాధితులకు కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం జరిగిన మీ కోసంలో 33 అర్జీలు అందాయని తెలిపారు.
మీ కోసంలో అర్జీలు..
● గుడ్లవల్లేరుకు చెందిన పద్మ అనే బాధితురాలు ఎస్పీని కలిసి 9 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఇరువురు పిల్లలు కలిగిన తర్వాత భర్త మరొక మహిళ వ్యామోహంలో పడి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, తన మాట వినని పక్షంలో తనతో పాటు పిల్లలను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని అతని నుంచి రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరింది.
● పెడనకు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి తాను చేపల చెరువు సాగు చేసుకుంటున్నట్లు తెలిపాడు. కాకినాడకు చెందిన ఒక వ్యక్తి తన వద్ద చేపలను కొనుక్కొని వెళ్లి నేటి వరకు డబ్బులు చెల్లించకపోగా అడుగుతుంటే చంపుతానని బెదిరిస్తున్నాడని న్యాయం చేయమని కోరాడు.
● అవనిగడ్డకు చెందిన వనజ అనే బాధితురాలు భర్త తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ వాపోయింది. అత్తమామలు తన భర్తకు మరో వివాహం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. బలవంతంగా విడాకులు ఇవ్వమని వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయమని కోరింది.
● మచిలీపట్నంకు చెందిన కుమార్ అనే వ్యక్తి తన స్నేహితునికి ఐదు లక్షలు చేబదులుగా ఇచ్చినట్లు తెలిపాడు. తీసుకున్న డబ్బు ఇవ్వమని అడుగుతుంటే నాలుగు నెలలుగా తన చుట్టూ తిప్పుకోవడంతో పాటు తనను దుర్భాషలాడుతూ మనుషులను పంపి తనపై దాడి చేయిస్తున్నాడని తెలిపాడు. అతని నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఎస్పీని కోరాడు.
మీ కోసంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు