
తండ్రిపై కుమారుడు దాడి
పెనమలూరు: తాడిగడప గ్రామంలో తండ్రిపై కుమారుడు విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేయగా పెనమలూరు పోలీసులు ఘటనపై విచారించి హత్యగా తేల్చి కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం నన్నం శౌరి(68) భార్యతో తాడిగడప శ్రీనివాసానగర్ కాలువ కట్టపై నివశిస్తున్నాడు. శౌరికి ముగ్గురు పిల్లలు. అందరికి వివాహం జరిగింది. శౌరి పెయింటర్‌గా పని చేస్తుండగా భార్య వంట పని చేస్తోంది. కాగా శౌరి కొడుకు కేశవరావు(30) కూడా పెయింటర్‌గా పని చేస్తాడు. కేశవరావు మద్యానికి బానిసగా మారటంతో అతని భార్య అతడిని వదిలి గుడివాడలోని పుట్టింటికి వెళ్లి పోయింది. కేశవరావు పెయింటింగ్ పనులు చేసే సమయంలో తండ్రి శౌరిని కూడా తనతో పనికి రావాలని ఒత్తిడి చేయసాగాడు. శౌరికి కూలీ సొమ్ము కేశవరావు ఇవ్వక పోవటంతో శౌరి పనికి రావటానికి నిరాకరించాడు.
పోలీసుల విచారణలో బట్టబయలు..
ఈ విషయమై ఆదివారం సాయంత్రం కుమారుడు తండ్రితో గొడవపడ్డాడు. దీంతో తండ్రిపై కుమారుడు విచక్షణా రహితంగా దాడి చేసి ఎదురింటి ఇనుప గేటుకు, రోడ్డుకు శౌరి తలను బలంగా కొట్టాడు. ఈ ఘటనను చూసిన శౌరి ఇంటి పక్కనే ఉంటున్న అతని కుమార్తె శశిరేఖ ఆమె భర్త బాబుతో పాటు స్థానికులు దాడిని నివారించే యత్నం చేశారు. అప్పటికే శౌరిని తీవ్రంగా కొట్టడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో అత్యవసర చికిత్సకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చా రు. చికిత్స పొందుతూ శౌరి సోమవారం ఉదయం మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై పోలీసులను తప్పుదారి పట్టించటానికి కేశవరావు యత్నించాడు. తాను తన తండ్రి శౌరి బైక్‌పై వస్తుండగా సిద్ధార్థ కాలేజీ వద్ద బందరు రోడ్డుపై ప్రమాదం జరిగిందని బుకాయించాడు. సీసీ ఫుటేజీలో ఎక్కడా రోడ్డు ప్రమాదం జరిగినట్లు కనబడక పోవటంతో పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో కేశవరావును, కుటుంబ సభ్యులను విచారించగా హత్య వ్యవహారం బయటకు వచ్చింది. కేశవరావుపై హత్య కేసు నమోదు చేశారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి
రోడ్డు ప్రమాదంగా చిత్రించే యత్నం