
వైద్య రంగం ప్రైవేటీకరణపై 24న జాతీయ సదస్సు
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకొస్తున్న ఆరోగ్య రంగ సంస్కరణల వలన రాష్ట్ర ఆరోగ్య రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో వైద్యరంగం ప్రైవేటీకరణ–ప్రభావాలు–పరిష్కారాలు అనే అంశంపై జాతీయ స్థాయి ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు సరైన వైద్యం అందక ప్రైవేట్ వైద్య ఖర్చులను భరించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు జరగబోయే వైద్య రంగంలోని మార్పుల వలన పేదల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి రాబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పబ్లిక్–ప్రైవేట్–భాగస్వామ్యం(పీపీపీ) నమూనా కింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోందన్నారు. ప్రజారోగ్యం ప్రైవేటీకరణ అంశంపై పలువురు ప్రొఫెసర్లు సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశంలో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.