
కలగా మిగిలిన రైలు మార్గం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, తిరువూరు నియోజకవర్గాలకు రైలు సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదించిన కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం గత 40 సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. అప్పటి ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు విజయవాడ పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న దివంగత చెన్నుపాటి విద్యకు ఈ రైలుమార్గం ప్రాధాన్యతను తెలియజేసి పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపాదింపజేశారు. వరుసగా నాలుగు బడ్జెట్లలోనూ ఈ రైలుమార్గాన్ని నిర్మించడానికి గల అవకాశాలపై సర్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కూడా కేటాయించింది. 2010లో తొలిసారి ఈ రైలుమార్గానికి రూ.10 కోట్లు కేటాయించి సర్వే చేయడానికి రైల్వేశాఖ కార్యాచరణ రూపొందించింది. గత పార్లమెంటు సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్ మినహా ఈ రైలుమార్గం గురించి విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇతర పార్లమెంటు సభ్యులెవరూ పార్లమెంటులో ప్రస్తావించలేదు. బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన తదుపరి ఈ రైలుమార్గాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించడంతో పాటు కొండపల్లి నుంచి నున్న, వెలగలేరు, వెల్వడం, మైలవరం, తిరువూరు మీదుగా రైలుమార్గం ఏర్పాటుకు సుముఖత చూపినా ఇంత వరకు తదుపరి చర్యలు తీసుకోలేదు.
రెండు రాష్ట్రాలకు అనుసంధానం..
కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం నిర్మిస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో ఈ రైలుమార్గాన్ని ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని కిరండల్ వరకు నిర్మించాలనే ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. దీనికి అనుసంధానంగా కొవ్వూరు – భద్రాచలం రైలుమార్గాన్ని గత పదేళ్లలో చేపట్టి పూర్తి చేశారు. ప్రస్తుతం కొండపల్లి నుంచి ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి వరకు రైలుమార్గం నిర్మిస్తే కొత్తగూడెం వరకు రైలు సదుపాయం కల్పించే అవకాశం ఉంటుంది. కొండపల్లి నుంచి పెనుబల్లికి 65 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండటంతో తక్కువ ఖర్చుతో రైలుమార్గం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇటీవల కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏపీలో కొత్త రైలుమార్గాల జాబితాలో కొండపల్లి – కొత్తగూడెం మార్గం లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
కీలకమైన రైలుమార్గం
కొత్తగూడెం సింగరేణి బొగ్గు గనులు, భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి పుణ్యక్షేత్రం తదితర ప్రాంతాలను కలిపే ఈ రైలుమార్గం ఆవశ్యకతను ఇకనైనా విజయవాడ పార్లమెంటు సభ్యులు గుర్తించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరితగతిన కార్యరూపం దాల్చే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇటీవల అసెంబ్లీలో ఈ రైలుమార్గం నిర్మాణం గురించి ప్రస్తావించినా అధికార పార్టీ స్పందించలేదు.
40 ఏళ్లుగా సర్వేలతో సరి ప్రతి బడ్జెట్‌లో నామమాత్రంగా నిధుల కేటాయింపు ఆచరణకు నోచుకోని కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం
నాయకులు శ్రద్ధ చూపాలి..
అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ కృష్ణాకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం గురించి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం శోచనీయం. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో కొత్త రైలుమార్గాల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉన్నా తదనుగుణంగా ప్రతిపాదనలను పంపకపోవడం తగదు. ఇకనైనా ఈ రైలుమార్గాన్ని నిర్మించడానికి ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపాలి.
– నల్లగట్ల స్వామిదాసు,
వైఎస్సార్ సీపీ తిరువూరు ఇన్‌చార్జి
రైలు మార్గం కల్పించాలి..
ఎన్టీఆర్ జిల్లాలోనే కాక రాష్ట్రంలో మారుమూల ఉన్న తిరువూరు, మైలవరం నియోజకవర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే రైలుమార్గం ఏర్పాటు ఎంతో అవసరం. ఈ రెండు నియోజక వర్గాల్లో ప్రభుత్వభూములు, అటవీ భూములు వేలాది ఎకరాలున్నందున వీటిని పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కేటాయించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైలుమార్గం నిర్మాణంతో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది.
– ఐవీకే కిషోర్, స్థానికుడు, తిరువూరు

కలగా మిగిలిన రైలు మార్గం

కలగా మిగిలిన రైలు మార్గం