
అభిమాన హీరో బ్యానర్ కట్టేందుకు వచ్చి.. అనంత లోకాలకు
పమిడిముక్కల: అభిమాన హీరో బ్యానర్ కట్టేందుకు వచ్చి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెనుమత్స గ్రామానికి చెందిన జుజ్జువరపు హర్ష(26) విజయవాడ గూడవల్లిలో నివాసం ఉంటూ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన ఓ సినీ హీరో పుట్టిన రోజు సందర్భంగా స్వగ్రామంలో బ్యానర్ కట్టేందుకు వెళ్లాడు. బ్యానర్ కట్టి బైక్‌పై తిరిగి విజయవాడ వెళ్తుండగా మార్గమధ్యలో మంటాడ రెడ్డిపాలెం వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొంది. దీంతో హర్ష తలకు తీవ్ర గాయమైంది. రెడ్డిపాలెం వాసులు పోలీసులకు, పెనుమత్స గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతునికి ఏడాది క్రితం వివాహమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీను తెలిపారు.