
ఐపీఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఐపీఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీఐపీఎంఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీఐపీఎంఈఏ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డిపార్ట్‌మెంట్‌లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తమ సంఘం రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. డిపార్ట్‌మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉద్యోగుల పదోన్నతులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. డిపార్ట్‌మెంట్ అధోగతి పాలుకావడానికి ఆయనే కారణమన్నారు. అతడిని తక్షణమే తొలగించి అదేస్థాయి అధికారిని పరిపాలన అధికారిగా నియమించాలని కోరారు.
150 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి..
ఐపీఎంకు డైరెక్టర్‌ను నియమించాలని రాజారావు కోరారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల పదోన్నతులు కల్పించాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన సింగిల్ పోస్టులను వెంటనే మంజూరు చేయాలని, మంత్రి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 150 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 50 శాతం పోస్టులు ల్యాబ్‌లోనే భర్తీ చేయాలన్నారు. జూనియర్ అనలిస్ట్‌లకు సర్వీసు రెగ్యులర్ చేయాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు డిపార్ట్‌మెంట్‌లో అవకాశం కల్పించాలని కోరారు. సీఐటీయూ నాయకులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐపీఎం నిర్వీర్యం కావడానికి అధికారులే కారణమన్నారు. ఐపీఎంను నిలబెట్టుకోవాలన్నా, పదోన్నతులు పొందాలన్నా, ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలన్నా పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. సమావేశంలో యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తాళ్లూరి వెంకటేశ్వర్లు, నేషనల్ హెల్త్ మిషన్ జేఏసీ నాయకులు దయామణి, చలం, బి. శ్రీనివాసరావు, సతీష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఏపీఐపీఎంఈఏ రాష్ట్ర అధ్యక్షుడు
వినుకొండ రాజారావు