
త్వరలో వేద పాఠశాలలో తరగతులు ప్రారంభం
తాడేపల్లి(ఘంటసాల): శ్రీపరిపూర్ణానందగిరి స్వామి ఆశీస్సులతో తాడేపల్లి ఆశ్రమంలోని బ్రహ్మ విద్యా కేంద్రం ప్రాంగణంలో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారి శృతిభారతి వేద పాఠశాలలో సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభించనున్నట్లు విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య గుళ్లపల్లి శ్రీరామ కృష్ణమూర్తి తెలిపారు. మండలంలోని తాడేపల్లిలో కృష్ణామండలం వ్యాసాశ్రమంలో ఎన్నారై మూల్పూరి వెంకట్రావు, సావిత్రి దంపతుల సౌజన్యంతో వేద పాఠశాల తరగతులు నిర్వహించనున్నారు. బ్రహ్మ విద్యా కేంద్రం ప్రాంగణంలో తిరుపతి రాష్ట్రీయ(జాతీయ) సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా గుర్తించబడిన సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో అర్చకత్వ పౌరోహిత్య(కర్మకాండ) అధ్యయన కేంద్రం, విశ్వవిద్యాలయ ప్రాక్ శాస్త్రి కార్యక్రమాలకు ప్రవేశం కల్పించి తరగతులు నిర్వహిస్తారు.
విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీరామ కృష్ణమూర్తి మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో మొదటసారిగా ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాలలో కులరహితంగా ప్రవేశాలు పొంది వేదాలు అభ్యసించాలన్నారు. ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు, డిప్లమో ఒక సంవత్సరం, ప్రాక్ శాస్త్రి కోర్సు రెండేళ్లు ఉంటుందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని చెప్పారు. కార్యక్రమంలో ఉపకులపతి సతీమణి రామలక్ష్మి, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం డైరెక్టర్, శృతిభారతి వేదపాఠశాల కోఆర్డినేటర్ డాక్టర్ జ్ఞాన్ రంజన్ పాండా, ఆశ్రమ నిర్వాహకులు కావూరి కోదండరామయ్య, గొర్రెపాటి రామకృష్ణ, మొవ్వ శ్రీరామమూర్తి, గొర్రెపాటి సురేష్, పి.శివకోటేశ్వరరావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శృతిభారతి వేదపాఠశాల విద్యార్థుల వసతి గదుల నిర్మాణానికి ఎన్నారై మూల్పూరి వెంకట్రావు – సావిత్రి దంపతులు శంకుస్థాపన చేశారు. మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నం చేయనున్నట్లు వారు చెప్పారు.