
విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): విద్యారంగం, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు కొండపల్లి క్రాంతి హైస్కూల్‌లో ఆదివారం జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు కోరుతుంటే, విద్యార్థి సంఘాలను పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అనుమతించవద్దని సర్క్యూలర్ తీసుకురావడం అత్యంత దారుణమన్నారు. సర్క్యూలర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా ఏడాది ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ సంక్షేమ హాస్టళ్లలో, విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని మండిపడ్డారు. ఆఫ్‌లైన్‌లో డిగ్రీ ప్రవేశాలు జరపాలని, పీజీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చడంలేదని విమర్శించారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు గోపి నాయక్, ఉపాధ్యక్షులు కుమారస్వామి, కుమార్ నాయక్, మాధవ్, ప్రణీత, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు