
వైద్య విజ్ఞానంపై విస్తృత ప్రచారం జరగాలి
గన్నవరంరూరల్: వైద్య విజ్ఞానంపై ప్రజల్లో మరింత విస్తృతంగా ప్రచారం జరగాలని చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు ఆకాంక్షించారు. సిద్ధార్థ అకాడమీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిబిషన్లను 3,400 మంది సందర్శించారు. మొత్తం 26 వేల మందికి పైగా ఈ ఎగ్జిబిషన్లను సందర్శించినట్లు చెప్పారు. వైద్యం పట్ల అవగాహన ఎంతో అవసరమన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతున్నా ఆ మేరకు విజ్ఞాన ప్రగతి సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారతదేశం అన్ని రంగాల్లో దూసుకువెళ్తోందని, వైద్య రంగంలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన వారిని అభినందించారు. ప్రతి ఒక్కరూ మానవ శరీర నిర్మాణంలో తమను తాము దర్శించుకున్నారని చెప్పారు. మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిబిషన్లలో అన్ని డిపార్టుమెంట్‌లు, నర్సింగ్ స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులు పాల్గొని సేవలందించారని కొనియాడారు. డైరెక్టర్ సీవీ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్‌కుమార్, డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.కళ్యాణి, ఏవోలు, డాక్టర్ రాజగోపాల్ పాల్గొన్నారు.
డెంటల్ కళాశాలలో..
చిన అవుటపల్లి డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో ఆదివారం 9 విభాగాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను విద్యార్థులు తిలకించారు. గ్రహణం మొర్రి, అంగిలి చీలిక విభాగంలో ఇప్పటి వరకు ఆస్పత్రిలో నిర్వహించిన ఆపరేషన్ల వివరాలను ప్రిన్సిపాల్ విద్యార్థులకు తెలియజేశారు. కమ్యూనిటీ విభాగం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సేవలు ప్రదర్శించారు. హెచ్‌వోడీలు కాళేశ్వరరావు, అజయ్‌బెనర్జీ, ఏవో వై.మధుసూదనరావు పాల్గొన్నారు.