
పులకించిన భక్తజన మది
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనంతో భక్తజన మది పులకించింది. దుర్గమ్మ దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివాహ సుముహూర్తాలు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యాల అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఘాట్‌రోడ్డు, మహా మండపం మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 క్యూలో ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటల వరకు రద్దీ ఓ మోస్తరుగా ఉండగా, తర్వాత అనూహ్యంగా పెరిగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభమవగా మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దీ కొనసాగింది. రాత్రి 7 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై మూడు రోజులుగా జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు ముగిశాయి. ఆదివారం ఉదయం మల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలోని యాగశాలలో అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు పూర్ణాహుతి చేశారు. తొలుత పవిత్రోత్సవాలను పురస్కరించుకుని పలు ప్రత్యేక వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం జరిగిన పూర్ణాహుతిలో ఈవో శీనానాయక్ దంపతులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రిపై రద్దీ కిటకిటలాడిన క్యూలు
నేటి నుంచి ఆర్జిత సేవలు..
పవిత్రోత్సవాలు పూర్తి కావడంతో సోమవారం నుంచి అన్ని ఆర్జిత సేవలు యధావిథిగా ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, నవగ్రహ హోమాలు వంటి ఆర్జిత సేవల టికెట్లు కౌంటర్లలో అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

పులకించిన భక్తజన మది