
అభ్యసన మదింపునకు సెల్ఫ్ అసెస్మెంట్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నెల 11 నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గతేడాది నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు. 2025– 26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో తొలి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్–1 (శాంప్) ఈ నెల 11 నుంచి నిర్వహించనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడానికి నిర్వహిస్తున్న పరీక్షలను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ను ప్రవేశపెట్టారు. గతేడాది 1నుంచి 8 తరగతుల వరకూ సీబీఏ అమలు చేయగా, ఈ ఏడాది 9వ తరగతికి కూడా సీబీఏ విధానాన్ని తీసుకొచ్చారు. టెన్త్ విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్–1 జరపనున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఇలా..
సీబీఏ విధానంలో నిర్వహించే పరీక్షలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఎయిడెడ్, ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో 1నుంచి 5 తరగతుల వరకు 33,983 మంది, 6 నుంచి 10 తరగతుల వరకు 56,094 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో సుమారు 90,077 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలో సుమారుగా 540 విద్యాసంస్థలు ఉన్నా వాటిల్లో కొద్ది విద్యాసంస్థలే అనుసరిస్తున్నాయి.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం...
ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు ఈ నెల నాలుగు నుంచి నిర్వహించాల్సి ఉండగా, అసెస్‌మెంట్ బుక్‌లెట్స్ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈ నెల 11కు వాయిదా వేశారు. జూన్, జూలై సిలబస్‌లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మదింపునకు సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సిలబస్‌తో పాటు, ఆరో తరగతికి రెడీనెస్ ప్రోగ్రామ్‌పై పరీక్ష ఉంటుంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు కొన్ని మార్పులతో పరీక్షలను నిర్వహిస్తున్నారు. 10వ తరగతికి నాలుగు ఎఫ్‌ఎలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు పాత విధానంలో అమలు చేస్తారు.
బైలింగ్విల్ ప్రశ్నపత్రాలు
సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం బైలింగ్విల్ విధానంలో ఉంటుంది. విద్యార్థికి ఇంగ్లిష్ ప్రశ్నపత్రం అర్థం కాకుంటే తెలుగులో చదివి ప్రశ్నను అర్థం చేసుకునేందుకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి బైలింగ్విల్ ప్రశ్నపత్రాలను ప్రవేశపెట్టారు.
నేటి నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు జిల్లాలో 90 వేల మంది ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు
కొండపల్లి జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినులు (ఫైల్)