
సీఎం రాక.. స్తంభించిన ట్రాఫిక్
పెనమలూరు: మండల పరిధిలో ఆదివారం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సీఎం చంద్రబాబునాయుడు పోరంకి రావడం, మండల పరిధిలోని కల్యాణ మండపాల్లో శుభకార్యక్రమాలు జరగడంతో ఒక్కసారిగా వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో బందరురోడ్డుపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సీఎం చంద్రబాబు పోరంకిలో జరిగిన శుభకార్యక్రమానికి రోడ్డు మార్గంలో రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించారు. ముఖ్యంగా చంద్రబాబు వచ్చిన సమయంలో పది నిమిషాల ముందుగానే బందరురోడ్డుపై వాహనాలు నిలిపివేయడంతో వాహనచదోకులు చాలా ఇబ్బందులు పడ్డారు.
సీఎం తిరిగి వెళ్లిన తర్వాత బందరురోడ్డుపై ట్రాఫిక్ వదలటం, బందోబస్తులో ఉన్న పోలీసులు ట్రాఫిక్ సమస్యలు పట్టించుకోకుండా విధుల నుంచి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనచోదకులు అవస్థ పడ్డారు.
ట్రాఫిక్ నియంత్రణ ఏది..?
జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు తరచూ విఫలమవుతున్నారు. ప్రజల కష్టాలను పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో బందరు రోడ్డుపై ట్రాఫిక్ పెరిగినా దాని నియంత్రణపై పోలీసు ఉన్నతాధికారులు శ్రద్ధ చూపడం లేదని వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు మండల పరిధిలో తరచూ తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సీఎం రాక.. స్తంభించిన ట్రాఫిక్