
ముత్యాలమ్మకు కరెన్సీ నోట్ల అలంకరణ
జగ్గయ్యపేట అర్బన్: శ్రావణ మాస ఉత్సవాల్లో పట్టణంలోని శ్రీముత్యాలమ్మ ఆలయంలో మూడో ఆదివారం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. రూ.5 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. కుమ్మరి శాలివాహన వంశస్తులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అప్పన మణికుమార్, కొత్తా రమేష్‌కుమార్, కార్యవర్గ సభ్యులు నోముల శివకుమార్, కొంకిమళ్ల సురేష్, అప్పన పిచ్చయ్య, సభ్యులు చేడె శ్రీరంగం, నాగప్రసాద్, తునికిపాటి మల్లేశ్వరాచారి, ఆరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు
మోపిదేవి: మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో నిండిపోయింది. తెల్లవారుజామునుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. దేవస్థానంలో నిర్వహించే స్వామివారి శాంతి కల్యాణంలో 73 మంది దంపతులు పాల్గొన్నారు. 203 మంది సర్పదోషనివారణ పూజలు చేశారు. సేవా టికెట్ల ద్వారా ఒక్కరోజులో స్వామివారి ఆదాయం రూ. 10,00,605 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ముత్యాలమ్మకు కరెన్సీ నోట్ల అలంకరణ