
ప్రైవేట్ వైద్యశాలలో శిశువు మృతి
ఇబ్రహీంపట్నం: మండలంలోని కొండపల్లిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనతో యువదంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మండలంలోని మూలపాడు గ్రామానికి చెందిన మస్కట్ల రాజేష్, శ్రావణి దంపతులు. శ్రావణి ఫిజియోథెరపిస్టు. వారు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. శ్రావణికి తొలికాన్పు కావడంతో కొండపల్లిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు వచ్చి అప్పడప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేవారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రావణిని కాన్పు కోసం వైద్యశాలలో చేర్చారు. స్కానింగ్ తీసి అంతా బాగానే ఉందని వైద్యులు చెప్పడంతో సంతోష పడ్డారు. మధ్యాహ్నం మూడు గంటలకు డెలివరీ చేసిన వైద్యులు మగబిడ్డ పుట్టాడని తల్లిదండ్రులకు చెప్పారు. సాయంత్రం ఐదు గంటలకు ఆ బిడ్డ మరణించాడని మృత శిశువును వారి చేతిలో పెట్టారు. మృతికి కారణం అడిగితే ఇక్కడి నుంచి వెళ్లిపొండని వైద్య సిబ్బంది వారిపై దాడికి దిగారు. ఈ సమాచారం అందుకున్న సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ విజయలక్ష్మి వైద్యశాలకు చేరుకుని వివరాలు సేకరించారు.