
అంగన్‌వాడీ వర్కర్లతో సెల్‌గాటం
గుడ్లవల్లేరు: ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లు తమకు వద్దంటూ అంగన్‌వాడీ వర్కర్లు తేల్చిచెబుతున్నారు. పనిచేసేందుకు మొరాయిస్తున్న ఫోన్లతో విధి నిర్వహణ ఎలాగని వాపోతున్నారు. ఆ ఫోన్లను తిరిగి ఇచ్చేస్తామంటూ ఐసీడీఎస్ జిల్లా అధికారులకు వర్కర్ల యూనియన్ నాయకులు వినతులు కూడా అందజేశారు. కృష్ణా జిల్లాలో ఉన్న 1,707 అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న వర్కర్లు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లతో ఆన్‌లైన్ వర్క్ చేసేందుకు ససేమిరా అంటున్నారు.
నిత్యం ఇబ్బందులే..
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బాల సంజీవిని యాప్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పోషణ ట్రాకర్‌లో అంగన్‌వాడీ వర్కర్లు నిత్యం ఆన్‌లైన్ వర్క్ చేయాల్సి ఉంది. నెలంతా వర్క్ చేసేందుకు 5 జీబీ నెట్ డేటాను మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఆ డేటా చాలక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ డేటా అయిపోయాక కొత్తగా డేటా రీచార్జి చేసేందుకు వీలు లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ వర్క్ ఎందుకు చేయలేదని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని వర్కర్లు వాపోతున్నారు. బాలింతలకు పోషకాహారాన్ని ఇచ్చేందుకు ఆధార్‌ను యాప్‌లో వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఆ ఆధార్ కార్డులో బాలింత ఫొటో 13 ఏళ్ల వయసులోది ఉంటుంది. ఆ ఫొటోలోని ముఖ కవళికలు గుర్తు పట్టేందుకు యాప్ ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఫోన్‌లో డేటా చాలక ఆ ప్రక్రియ మధ్యలో నిలిచిపోతోంది.
ఆన్‌లైన్ హాజరు తప్పనిసరి
బాల సంజీవిని, పోషణ ట్రాకర్ రెండు యాప్‌లలో వర్కర్లు రోజూ ఉదయం విధులకు వచ్చినప్పుడు హాజరు నమోదు చేయాలి. సాయంత్రం నాలుగు గంటలకు విధులు ముగిశాక మరోసారి నమోదు చేయాలి. ఒక్కోసారి హాజరు నమోదవుతుంది, ఒక్కో సారి కావడంలేదు. అంగన్‌వాడీ కేంద్రానికి గుడ్లు ఇతర సరుకులు వచ్చినప్పుడు ఫొటో తీసేందుకు ఫోన్‌లో కెమెరా పనిచయదు. అంగన్‌వాడీ కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా నెట్ సిగ్నల్ లేని కుగ్రామాల్లో కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో వర్కర్లకు ఇబ్బందులు తప్పడంలేదు.
జిల్లాలో 1,707 అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్లు మొరాయిస్తున్న ఫోన్లతో వర్కర్లు సతమతం
ఫోన్లు తీసుకోలేదు
బాల సంజీవిని, పోషణ ట్రాకర్‌లోని రెండు యాప్‌లలో ఆన్‌లైన్ వర్క్ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లను అంగన్‌వాడీ వర్కర్లు తమ శాఖకు తిరిగి ఇస్తామని వినతి పత్రాలు అందించారు. కానీ ఆ ఫోన్లను మేము తీసుకోలేదు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు ప్రస్తుతం అంగన్‌వాడీ వర్కర్ల వద్దే ఉన్నాయి.
– ఎం.ఎన్.రాణి, ఐసీడీఎస్ జిల్లా పీడీ
ఈ ఫోన్లు మాకొద్దు..
అంగన్‌వాడీ కేంద్రాల విధులకు దూరం చేస్తూ, ఆన్‌లైన్ వర్కకే గంటల తరబడి పరిమితం చేస్తున్న ప్రభుత్వ ఫోన్లను వర్కర్లు తిరస్కరిస్తున్నారు. బాల సంజీవిని, పోషణ ట్రాకర్ ఈకేవైసీ ద్వారా రేషను తీసుకున్న వారిని వీడియో తీసేందుకు డేటా చాలటం లేదు. అధికారులు కొన్ని వీడియో లింకులు పెడతారు. వర్కర్లు వాటిని అవగాహన చేసుకుని పిల్లలకు నేర్పాలి. కాని ఆ వీడియోలు చూసేందుకు కూడా డేటా చాలటం లేదు. యాప్‌లలో ఆన్‌లైన్ వర్క్ అంతా ఇంగ్లిషులోనే ఉటుంది. పదో తరగతి చదువు కున్న చాలామంది అంగన్‌వాడీ వర్కర్లకు ఇంగ్లిషు అర్థంకాక ఇబ్బంది పడుతున్నారు. చాలినంత డేటా ఉండేలా కొత్త ఫోన్లను ఇస్తేనే ఆన్‌లైన్ వర్క్ చేస్తామని వర్కర్లు అంటున్నారు.

అంగన్‌వాడీ వర్కర్లతో సెల్‌గాటం