
దుర్గగుడి ప్రొటోకాల్ సిబ్బందికి మెమోలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌కు మంగళవారం దుర్గగుడిపై ఎదురైన చేదు ఘటనపై దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయ్‌కుమార్ కారును ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తనకు ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే నేరుగా ఆలయ ఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఆలయ అధికారులు ప్రొటోకాల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. సూపరింటెండెంట్ కుర్రెళ్ల శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ డి.వి.ఎన్.రాజు, రికార్డు అసిస్టెంట్ పి.శ్రీనివాసులు, అటెండర్ జి.కృష్ణమ్మ, వి.ఓంకార్‌ను తాత్కాలికంగా ప్రొటోకాల్ విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మెమో అందుకున్న ఏడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ప్రొటోకాల్ విధుల నుంచి తొలగించిన వారి స్థానంలో సూపరింటెండెంట్ వి.సూర్యనారాయణమూర్తి, జూనియర్ అసిస్టెంట్ కె.సతీష్, రికార్డు అసిస్టెంట్ ఎం. జయప్రకాష్(పేషీ), ఎన్‌ఎంఆర్ పునిత్‌కుమార్, ఎంసీఎస్ వరప్రసాద్‌కు అదనపు విధులు కేటాయించారు.
దేవదాయశాఖ మంత్రిని కలిసిన ఎన్‌ఎంఆర్‌లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వివిధ దేవాలయాల్లో 30 ఏళ్లగా ఎన్‌ఎంఆర్‌లుగా విధులు నిర్వహిస్తున్న పలువురు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని బుధవారం కలిశారు. తమను రెగ్యులర్ చేయాలని కోరారు. విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు, శ్రీశైలం, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం దేవస్థానాలకు చెందిన ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. గతంలోనూ దేవదాయ శాఖ మంత్రి ఆనంను తాము కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్‌ఎంఆర్‌లకు తగిన న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘ అధ్యక్షులు ఎన్.వి.రమణ, ఎ.కె.డి.శివ కుమార్, ఉడేపు రాజేశ్వరరావు, పునిత్, వెంకట్ తదితరులు ఉన్నారు.
‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో జైరుద్రకు చోటు
పెనమలూరు: మండలంలోని పోరంకి గ్రామంలో ఆరేళ్ల బాలుడు అసాధారణ ప్రతిభ చాటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సాఽధించాడు. ఈ చిన్నారి అద్భుత ఆధ్యాత్మిక ప్రతిభ ప్రదర్శించి ఈ ఘనత సాధించాడు. 49 నిమిషాల 39 సెకన్లలో పూర్తి రామాయణ గాథను శ్రద్ధతో స్పష్టంగా పఠించాడు. జైరుద్ర వయసు ఆరు సంవత్సరాల మూడు నెలలు. ఒకటో తరగతి చదువుతున్నాడు. బాలుడికి చిన్ననాటి నుంచే అపూర్వ శ్రవణశక్తి ఉంది. దేనినైనా శ్రద్ధగా విని మదిలో నిలుపుకొని స్పష్టంగా తిరిగి పఠించగలడు. ఈ అసాధారణ శక్తితో ఆధ్యాత్మిక పాఠాలు వినటం, గుర్తుంచుకోవటం, పఠించటం సహజంగానే చేస్తున్నాడు. జైరుద్ర కాలభైరవ అష్టకాన్ని అత్యంత వేగంగా పఠించి రికార్డుల్లో స్థానం సంపాదించాడు. బాలుడి తల్లి గంగాశ్రీ మాట్లాడుతూ జైరుద్ర విజయాలు వ్యక్తిగత ఘనతే కాకుండా మన ప్రాచీన ధార్మిక సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసి స్ఫూర్తిదాయకంగా మారాయన్నారు.

దుర్గగుడి ప్రొటోకాల్ సిబ్బందికి మెమోలు