
హాస్టళ్లలో ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీలు
గన్నవరం/గుడివాడరూరల్: రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సీహెచ్.విజయ ప్రతాపరెడ్డి బుధవారం గన్నవరం మండలం, గుడివాడలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత గన్నవరం ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన ఆయన విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న అల్పాహారం నాణ్యతను పరిశీలించారు. ఇక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసి, వార్డెన్ ప్రకాష్‌ను సత్కారించారు. అనంతరం దావాజిగూడెంలోని బాలికల ఎస్సీ, బీసీ హాస్టళ్లు, కళాశాల వసతి గృహం, ఎస్సీ మోడల్ హాస్టళ్లలో భోజన వసతులను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే అల్పాహారంలో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. గుడివాడలోని బేతవోలు మునిసిపల్ హైస్కూల్, టౌన్ హైస్కూల్, మోటూరు గురుకుల పాఠశాలను విజయప్రతాపరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనం తిని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. తనిఖీల సందర్భంగా గన్నవ రంలో కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వసతి గృహాల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా ఎక్కువగా తనిఖీలు నిర్వహిస్తున్నానని తెలిపారు. రోజుకు ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం కేటాయిస్తున్న రూ.47తో మెనూ సర్దుబాటు కాక వార్డెన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణా జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మోహన్‌రావు, జిల్లా మేనేజర్ టి.శివరాంప్రసాద్, సాంఘిక సంక్షేమ ఉపసంచాలకుడు షేక్ షాహిద్‌బాబు, వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ అధికారి జి.రమేష్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి దూర్జటి, డీఈఓ పి.వి.జె.రామారావు తదితరులు పాల్గొన్నారు.