మచిలీపట్నంటౌన్: సామాజిక మాధ్యమాలను వినియోగించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, లేని పక్షంలో వారి బ్యాంకు ఖాతాలోని నగదు అపహరణకు గురవుతుందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు హెచ్చరించారు. స్థానిక పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయలో బుధవారం డిజిటల్, సైబర్ క్రైం, రహదారి భద్రతలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేటి సమాజంలో డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు వృద్ధులు, పెద్దలను భయభ్రాంతులకు గురి చేసి వారి బ్యాంక్ ఖాతాలో నగదును దోచుకుంటున్నారని తెలిపారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి వాటి నుంచి స్నేహితులు మాదిరిగా నగదు కోసం రిక్వెస్ట్ పెట్టి నగదు దోచుకుంటున్నారన్నారు. ప్రతి విద్యార్థీ సైబర్ క్రైం పై అవగాహన పెంచుకొని సైబర్ వారియర్‌గా పని చేస్తూ వారి కుటుంబాలను, సమాజంలోని నిరక్షరాశ్యులను చైతన్య పరచాలని సూచించారు. అతివేగం అత్యంత ప్రమాదకర మని, సరదా కోసం బైక్ కార్ రైడింగ్‌లో జాగ్రత్తలు పాటించకుండా వేగంగా వాహనాలు నడప రాదన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా, విద్యాలయ ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్, పీజీటీలు జె.సత్య నారాయణ, రెమ్యా, బి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు