
రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాజకీయ నాయ కుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వారో స్పష్టంగా తెలియని స్థితి ఉందనన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ 56 ఏళ్లుగా పార్టీలో సేవలందిస్తున్న సందర్భంగా ఆయనకు బుధవారం విజయవాడలోని ఓ ఫంక్షన్ హాటులో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. శ్రీమన్నారాయణను తన వ్యక్తిగత స్నేహితుడిగా పేర్కొన్నారు. జట్కా బండ్లపై తిరిగి వాజ్‌పేయి, అద్వానీతో ప్రచారం చేసిన రోజుల నుంచే శ్రీమన్నారాయణ బీజేపీ కోసం పదవులపై ఆశ లేకుండా, సిద్ధాంత నిబద్ధతతో పని చేశారని గుర్తు చేశారు. గతంలో నాయకులు ఒక పార్టీ విడిచి మరొకదాన్ని చేరేటప్పుడు సిద్ధాంతాలు, కారణాలు ఉండేవని, నేడు డైపర్లు మార్చినంత సులువుగా పార్టీలు మారుతున్నారని విమర్శించారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండేలా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కామి నేని శ్రీనివాస్, బోడే ప్రసాద్ పాల్గొన్నారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు