
పైసలిస్తేనే ఫైలు కదిలేది!
గుడివాడరూరల్: గుడివాడ డ్రెయినేజీ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులు చేసిన వారికీ లంచాలు ఇవ్వనిదే బిల్లులు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. హైకోర్టు సైతం పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినా అధికారులు బేఖాతరు చేస్తున్నారు. విసిగిపోయిన కాంట్రాక్టర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అవినీతి బహిర్గతం అయ్యింది.
తూడు తోసేయ్.. బిల్లులు చేసేయ్..
మేజర్ డ్రెయిన్ అయిన చంద్రయ్య ద్వారా నందివాడ, మండవల్లి, గుడివాడరూరల్ మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు మురుగునీరు బయటకు వెళ్లేందుకు ఉపయోగపడుతోంది. ఏటా డ్రెయిన్‌లో గుర్రపుడెక్క మేట వేసి నీటి ప్రవాహానికి అవరోధంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెయింటెనెన్స్ నిధుల పేరిట 2024జూన్ 1నుంచి 2025 మే 31 వరకు ఏడాది కాలానికి గాను రూ.20.17లక్షలను మంజూరు చేశారు. టెండర్ల ప్రక్రియలో భాగంగా పెడన ప్రాంతానికి చెందిన వ్యక్తి పనులు చేయడానికి 23శాతం మైనస్‌తో పనులు చేయడానికి టెండర్ దక్కించుకున్నారు. అది జరిగి ఏడాది కాలం గడిచినా.. ఇప్పటి వరకు కాంట్రాక్టర్ పనులు చేసిన దాఖలాలు లేవు. డ్రెయిన్‌కు నీరు వచ్చిన సమయంలో గుర్రపుడెక్క నీటి ప్రవాహానికి పోలుకొండ రెగ్యులేటర్ వద్ద షట్టర్లు మూసివేయడంతో భారీస్థాయిలో డెక్క నిల్వ ఉండిపోతోంది. లస్కర్లు, అధికారులతో కుమ్మకై ్కన కాంట్రాక్టర్లు తూడు, డెక్క తొలగించకుండా రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా షట్టర్లను లేపి గుర్రపుడెక్కను కొల్లేరులోకి వదిలేస్తున్నారు. అది కాస్త కొల్లేరు ప్రాంతంలో చంద్రయ్య, బుడమేరు కలిసే చోట దట్టంగా పేరుకుపోయి నీరు దిగువకు సవ్యంగా ప్రవహించడం లేదు. ఫలితంగా రైతన్నలకు తీవ్ర కష్టం ఏర్పడుతోంది. ఇటీవల వర్షాల సమయంలో దీని కారణంగానే ఎగువనున్న పంట పొలాలు ముంపునకు గురై రైతులకు నష్టాన్ని కలిగించాయి.
బుడమేరులోనూ ఇదే తంతు..
రాష్ట్రంలోనే మేజర్ డ్రెయిన్‌గా పేరున్న బుడమేరుది ఇదే తంతు. నందివాడ మండలంలోని పుట్టగుంట వంతెన నుంచి కొల్లేరులోకి డ్రెయిన్ కలిసే ప్రాంతం వరకు గుర్రపుడెక్క, తూడు తొలగింపునకు గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది మే నెల వరకు రూ.31.98లక్షల మేర మెయింటెనెన్స్ నిధులు మంజూరు చేశారు. గుడివాడ ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్ మైనస్ 48శాతం తక్కువతో పనులు చేయడానికి కాంట్రాక్ట్ చేజిక్కించుకున్నారు. చేయని పనికి ఎంత బిల్లు వస్తే ఏముంది అన్నట్లుగా అధికారులతో వాటాలు వేసుకుని మరీ బిల్లులు దక్కించుకుంటున్నారు. సదరు కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో బిల్లులు చేయించుకోవడానికి అడ్డే లేకుండా పోయింది. ఆత్కూరు డ్రెయిన్‌ది ఇదే పరిస్థితి. డ్రెయిన్ పూడిక, మెయింటెనెన్స్‌కు రూ.30లక్షల వరకు మంజూరు కాగా నీటి సంఘాల రూపంలో కూటమి నాయకులు పనులు దక్కించుకుని తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు చేజిక్కించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
గుడివాడ డ్రెయినేజీ శాఖలో రాజ్యమేలుతోన్న అవినీతి
డ్రెయినేజీ కార్యాలయం అంటేనే హడల్..
కూటమి సానుభూతి కాంట్రాక్టర్లదే పెత్తనం
పనులు చేయకుండానే బిల్లులు
కమీషన్ల కక్కుర్తితో అధికారులు జీహుజూర్
సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అంతా ఇదే తీరు
ఏసీబీ దాడులతో అవినీతి బట్టబయలు
గుడివాడ డ్రెయినేజీ కార్యాలయం పేరు చెబితే కాంట్రాక్టర్లు హడలెత్తిపోతున్నారు. సక్రమంగా పనులు చేసిన వారికి బిల్లులు మంజూరు చేయకుండా, పని చేయకుండా లంచాలు ఇచ్చే వారికే బిల్లులు ఇస్తుండటంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ప్రతి పనికి రేటు కట్టి మరీ ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో కార్యాలయానికి వెళ్ల్లాంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. వర్క్ ఇన్‌స్పెక్టర్ల దగ్గర నుంచి క్వాలిటీ కంట్రోల్, ఉన్నతశాఖ అధికారుల వరకు బిల్లులో 22శాతం వరకు సమర్పించుకుంటేనే బిల్లులు చేస్తున్నారనే కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. బిల్లుల కోసం హైకోర్టును ఆశ్రయించి ఆదేశాలు తెచ్చుకున్నా తమకు ఇవ్వాల్సింది ్చఇస్తేనే బిల్లులు చేస్తామని అధికారులు తెగేసి చెబుతుండటంతో కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పైసలిస్తేనే ఫైలు కదిలేది!