ఘాటు తగ్గిన సాగు | - | Sakshi
Sakshi News home page

ఘాటు తగ్గిన సాగు

Aug 6 2025 6:16 AM | Updated on Aug 6 2025 6:16 AM

ఘాటు

ఘాటు తగ్గిన సాగు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎర్ర బంగారంగా పేరు పొందిన మిరప సాగుకు రైతులు దూరమవుతున్నారు. అసలు ఆ పంట పేరు చెబితేనే వణికిపోతున్నారు. ధర భారీగా పతనం కావడమే ఇందుకు కారణం. ఒకప్పుడు క్వింటా ధర గరిష్టంగా రూ.25 వేలకు చేరింది. ఆ తర్వాత అమాంతం రూ.8 వేలకు పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం పెట్టుబడి ఖర్చులు రాకపోగా అప్పుల్లో కూరుకుపోయారు. కోల్డ్‌ స్టోరేజ్‌ల్లో పంట నిల్వ చేసిన రైతులు అద్దె, వడ్డీల భారంతో అల్లాడుతున్నారు. మిర్చి ధర పూర్తిగా పతనం కావడంతో ఈ ఏడాది ఆ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులు ఈ సారి సుబాబుల్‌, పత్తి సాగు వైపు మళ్లారు. దీంతో మిరప నారు కొనేవారు లేక నర్సరీల యజమానులు తలలు పట్టుకుంటున్నారు.

రూ.15 వేల ధర వస్తేనే గిట్టుబాటు

ఎన్టీఆర్‌ జిల్లాలో ఏటా మెట్ట ప్రాంతమైన గంపలగూడెం, వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో, చందర్లపాడు, నందిగామ, వీరులపాడు మండలాల్లో కొంత మేర మిర్చి సాగవుతుంది. గతేడాది జిల్లాలో 14 వేల హెక్టార్లలో రైతులు ఈ పంట సాగు చేశారు. 190 నర్సరీల్లో మిర్చి నారు పెంచేవారు. రైతులు పండించిన పంట నిల్వ చేసుకునేందుకు జిల్లాలో 16 కోల్డ్‌ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. ఒక ఎకరం మిర్చి సాగుకు దుక్కులు, విత్తనం, నారు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు ఇలా అన్ని కలుపుకొని రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడికి వెచ్చించాల్సి వచ్చేది. కౌలు రైతులకు అదనంగా రూ.50 వేల కౌలు భారం తప్పదు. ఎకరాకు అవసరమైన నారు కొనుగోలుకు రూ.24 వేల నుంచి రూ.28 వేల ఖర్చవుతుంది. ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చి క్వింటా ధర రూ.15 వేలకు పైగా పలికితేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది.

నాటి ధర నేడేది...?

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24 సంవత్సరంలో క్వింటా మిర్చి ధర గరిష్టంగా రూ.25 వేలు పలికింది. ఈ ధర మిర్చి రైతులకు ఊపు, ఉత్సాహం ఇచ్చింది. కూటమి ప్రభుత్వం హయాంలో ధర పూర్తిగా పతనమైంది. సాధారణ రకం క్వింటా ధర రూ.7 వేల నుంచి రూ.8 వేలు, నాణ్యమైన మిర్చి ధర రూ.11 వేల నుంచి రూ.13 వేలు మాత్రమే పలుకుతోంది. దీంతో స్తోమత కలిగిన రైతులు పండిన పంటను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. కొందరు బాకీల బెడదతో తక్కువ ధరకు విక్రయించారు. దిగుబడి తగ్గడం, ధర పతనం కావడంతో గత ఏడాది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రస్తుతం జిల్లాలోని 16 కోల్డ్‌ స్టోరేజీల్లో 6.40 లక్షల టిక్కీల మిర్చి నిల్వ ఉంది. మరి కొందరు తెలంగాణలోని కోల్డ్‌ స్టోరే జీల్లో నిల్వచేశారు. స్టోరేజీల్లో నిల్వ చేసిన రైతులకు అద్దె భారంగా మారింది. 35 కిలోల టిక్కీకి ఆరు నెలలకు రూ.170 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఏటా కోల్డ్‌ స్టోరేజ్‌లు రుణాలు ఇచ్చేవి. ఈ ఏడాది రుణాలు ఇచ్చేందుకు నిరాకరించాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ ఏడాది మిర్చి సాగు చేసేది లేదని పలువురు రైతులు తేల్చి చెబుతున్నారు. కౌలు రైతులు మిర్చి సాగు విరమించుకోగా సొంత భూమి ఉన్న రైతులు సుబాబుల్‌, పత్తి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఉద్యాన వన శాఖ ఈ ఏడాది 11 వేల హెక్టార్లలో మిర్చి సాగవుతోందని అంచనా వేస్తోంది. వాస్తవంలో సగానికి సగం కూడా సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

మిరప సాగుకు దూరమవుతున్న రైతులు సగానికి సగం తగ్గనున్న సాగు విస్తీర్ణం ధర పతనంతో భయపడుతున్న రైతులు ఆందోళనలో నర్సరీల యజమానులు

నర్సరీల్లో తగ్గిన నారుపెంపకం

మిర్చి సాగు మానేశా

గత ఏడాది సొంత భూమి ఏడు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. దిగుబడి, ధర రెండూ లేవు. పెట్టిన పెట్టుబడి రాలేదు. గిట్టుబాటు కాదని, నష్టం భరించలేక ఈ ఏడాది మిర్చి సాగు చేయడం మానేశా. పత్తి, సుబాబుల్‌ సాగుచేస్తున్నా.

– కొండబోలు నారాయణ, రైతు, మక్కపేట

మిర్చి సాగుచేయను

గతేడాది మూడెకరాల్లో మిర్చి పంట సాగు చేశా. దిగుబడి బాగానే వచ్చింది. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత ధర దిగజారింది. క్వింటా రూ.10 వేల చొప్పునే విక్రయించాల్సి వచ్చింది. ఈ ఏడాది మిర్చి సాగు చేయదలచుకోలేదు.

– సాంబిరెడ్డి, రైతు, జయంతి

ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా వత్సవాయి మండలం మక్కపేటలో మిర్చి నర్సరీలు ఉన్నాయి. ఒక్కో నర్సరీ ఐదు నుంచి పది ఎకరాల్లో మిరప నారు పెంచుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కో నర్సరీలో రెండెకరాల్లోనే మిరప నారు పోశారు. మిర్చి మేలు రకం విత్తనాల ధర కిలో రూ.90 వేలు పలుకుతోంది. నారు పెంచేందుకు ఒక్కో నర్సరీకి రూ.లక్షల్లో ఖర్చవుతోంది. ఈ ఏడాది మిర్చి ధర పతనం కావడంతో నర్సరీ యాజమాన్యంలోనూ నిరుత్సాహం నెలకొంది. ఏటా జూన్‌, జూలై నెలల్లో రైతులు మిరప నారు కోసం నర్సరీల చుట్టూ తిరిగే వారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని నర్సరీ యజమానులు చెబుతున్నారు. ఏటా మొక్క రూ.2 చొప్పున విక్రయించే వారు. ఈ ఏడాది మొక్క ధర రూపాయి నుంచి రూ.1.40 వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పటికే పెంచిన నారు అమ్ముడుపోతుందో లేదోనన్న ఆందోళనలో నర్సరీల యజమానులు ఉన్నారు.

ఘాటు తగ్గిన సాగు 1
1/2

ఘాటు తగ్గిన సాగు

ఘాటు తగ్గిన సాగు 2
2/2

ఘాటు తగ్గిన సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement