
8 నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): స్థానిక శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై ఈ నెల ఎనిమిది నుంచి పదో తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఏడో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఉదక శాంతి, ఎనిమిదో తేదీ ఉదయం తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి ఇతర ఉపాయాలలో దేవతా మూర్తులకు పవిత్ర మాలధారణ జరుగుతుంది. ఉదయం 9.30 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. పదో తేదీ ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతి, కలశోద్వాసన, మహాదాశీర్వచనంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.
8న వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనం
శ్రావణ మాసం మూడో శుక్రవారాన్ని పుర స్కరించుకుని ఎనిమిదో తేదీన దుర్గమ్మ సన్నిధిలో వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద ఆలయ అర్చకులు ఏకాంత సేవగా మాత్రమే వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.
మూడు రోజులు సేవలు నిలిపివేత
దుర్గగుడిలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎనిమిది, తొమ్మిది, పది తేదీల్లో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించే అన్ని ప్రత్యక్ష, పరోక్ష సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో నిర్వహించే ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేస్తారు. 11వ తేదీ నుంచి దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు జరిగే అన్ని ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయి.