
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
చిలకలపూడి(మచిలీపట్నం): బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో మంగ ళవారం వివిధ శాఖల అధికారులతో బాలల హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. పద్మావతి మాట్లాడుతూ.. తమ కమిషన్‌తో పాటు అన్ని శాఖలు కలిసి బాలల కోసం రూపొందించిన చట్టాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో బాలల హక్కుల కమిషన్ చేసిన సూచనలు పాటించాలని స్పష్టంచేశారు. బాల్య వివాహాలను అడ్డుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, టీనేజీ ప్రెగ్నెన్సీపై దృష్టిసారించి జిల్లాలో వీటి నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్, లైంగిక వేధింపుల నివారణ తదితర అంశాల కోసం కమిటీలను నిర్వహించాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కమిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తే కమిషన్ తరఫున చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలకు సంబంధించిన సమస్యల కోసం 1098 లేక 100 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. ప్రతి పాఠశాలల్లో క్రీడామైదానాలు, గేమ్స్ అవర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, రక్తహీనత నివారణకు ఐరన్‌ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.చంద్ర శేఖరరావు, ఏఎస్పీ వి.వి.నాయుడు, డీఎస్పీ జి.శ్రీనివాసరావు, డీఈఓ పి.వి.జె.రామారావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహిద్‌బాబు, గిరిజన సంక్షేమ అధికారి ఎం.ఫణిదూర్జటి, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.శర్మిష్ట తదితరులు పాల్గొన్నారు.