
ప్రమాదంలో శ్రీశైలం జలాశయం
గుడ్లవల్లేరు/పెడన: ప్రకాశం బ్యారేజీకి సాగునీరు అందించే శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టుకు ఇబ్బంది వస్తే గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో తిండి కూడా కరువవుతుందన్నారు. గుడ్లవల్లేరులో మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. పెడన టీడీపీ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో పాటు సాగునీటి సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. బంటుమిల్లి కాలువ ద్వారా శివారు భూములకు నీరందని పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. సరైనా సమాధానం రాకపోవడంతో ఇరిగేషన్ శాఖ సీఈకి ఫోన్ చేశారు. ఢిల్లీలో ఉన్నానని సీఈ చెప్పడంతో మంత్రి మండిపడ్డారు. ఎగువ పొలాలు ముంపునకు గురవుతున్నాయి, దిగువ పొలాలకు నీరందడం లేదు, ఈ సమస్యలను చక్కదిద్దకపోతే సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ పొట్లూరి రవి, బంటుమిల్లి డీసీ చైర్మన్ బొర్రా కాశీ తదితరులు పాల్గొన్నారు.
భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు