
కృష్ణా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ
స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్ర దిన వేడుకలకు సర్వం సిద్ధం చేయాలని కృష్ణా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో సోమవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర వేడుకలకు పోలీస్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్ గౌరవవందనం, కవాతు, బందోబస్తు, ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు సిట్టింగ్ ఏర్పాటు, స్వాతంత్య్ర సమరయోధులను గుర్తించి వివరాలను సిద్ధం చేయాలని చెప్పారు. ఉద్యోగుల సేవలను గుర్తిస్తూ వారికి అందించే ప్రశంసాపత్రాల విషయంలో ముందుగానే ఆయాశాఖల అధికారులు జాబితాలు సిద్ధం చేసుకోవాలన్నారు. సంక్షేమాఽభివృద్ధి ప్రతిబింబించేలా శకటాలు, స్టాళ్ల ప్రదర్శన ఉండాలన్నారు. దేశభక్తిని చాటే సాంస్కృతిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఈసారి విద్యార్థులను కవాతులో భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమానికి అవరోధం కలగకుండా రైన్ ప్రూఫ్ టెంట్‌లతో పాటు పాల్గొన్న వారికి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, బందరు ఆర్డీవో కె.స్వాతి, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, మెప్మా, డ్వామా పీడీ సాయిబాబు, శివప్రసాద్ పాల్గొన్నారు.