ఇబ్రహీంపట్నం: గుర్తుతెలియని వాహనం ఢీకొని యాచకురాలు మృతి చెందిన ఘటన మండలంలోని జూపూడి గ్రామంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జూపూడి, కిలేశపురం గ్రామాల మధ్య యాచక వృత్తితో జీవిస్తున్న సుమారు 40ఏళ్ల వయస్సు గల యాచకురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొని కొద్దిదూరం ఈడ్చుకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో యాచకురాలి మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతురాలు ఎరుపు రంగు జాకెట్, ఎరుపు రంగు లంగా, బ్లూ, పింక్ రంగు డిజైన్ చీర ధరించి ఉంది. జూపూడి గ్రామ వీఆర్వో గుడిశ వెంకట శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
గంజాయి తాగుతున్న నలుగురు యువకుల అరెస్ట్
ఇబ్రహీంపట్నం: గంజాయి కలిగి ఉన్న నలుగురు యువకులను ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. తుమ్మలపాలెం బస్టాప్ వెనుక గల డొంక రోడ్డులో నలుగురు యువకులు గంజాయి తాగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద లభించిన 1,200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నలుగురిని విచారించిన అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదవశాత్తూ బావిలో పడి యువకుడి మృతి
నందిగామ రూరల్: ప్రమాదవశాత్తూ పొలం వద్దనున్న బావిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని అడవిరావులపాడు గ్రామానికి చెందిన తోట వెంకట నారాయణకు ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు తిరుపతిరావు(24) ఉన్నారు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకునే తిరుపతిరావు వ్యవసాయ పనుల నిమిత్తం సోమవారం గ్రామంలోని తమ పొలంలోని బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ దానిలో పడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి హుటాహుటిన నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.